
'నేను వీఐపీని.. నాకు సిగ్నల్ లేదు..తప్పుకో'
న్యూఢిల్లీ: దేశంలో వీఐపీ కల్చర్ పెరిగిపోతోంది. వారి ఆగడాలు రోజుకింత పెరిగిపోతున్నాయి. వారి చేష్టలతో సామాన్య జనాలకు తెగ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ప్రశ్నించినవారిపై దాడికి సిద్ధపడుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్రంమంత్రి మహేశ్ శర్మ కారును ఆపారనే కారణంతో ఆయన ప్రభుత్వేతర సిబ్బంది సెక్యూరిటీ గార్డ్స్ పై దారుణంగా దాడి చేసిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. నోయిడాలో ఈ ఘటన ఆగస్టు 24న జరిగింది. దీనిని రికార్డు చేసిన ప్రశాంత్ సక్సేనా అనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో దానిని పోస్ట్ చేయగా సదరు వీఐపీ నిర్వాకంపై పలువురు పెదవి విరుస్తున్నారు.
అందులో రికార్డయిన ప్రకారం నోయిడాలోని ఓ చౌరస్తా వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడింది. దాంతో అన్ని వాహనాలు ఆగాయి. వాటి పక్కన ఓ కారు ఆగింది. అందులోని ఒక వ్యక్తి అతడి కారు ఎదురుగా ఉన్న ఓ మోటారు సైకిలిస్టును పక్కకు జరగమని అడిగాడు. ఇంకా సిగ్నల్ పడలేదుగా అని అతడు ప్రశ్నించగా తాను వీఐపీనని చెప్పాగా.. అంటు దురుసుగా మాట్లాడాడు. ఈ క్రమంలో అతడిపై దాడి చేసినంత పనిచేశాడు. ఇదంత ఓ కారులో కూర్చుని ఉన్న ప్రశాంత్ తన ఫోన్ లో రికార్డు చేస్తుండగా అతడి కూతురు తండ్రికి చెప్పడంతో రికార్డు చేస్తున్న ప్రశాంత్ పైకి దూసుకొచ్చి ఆ ఫోన్ ను కిందపడేశాడు. నోయిడాలోని సెక్టార్ 57లో ఉదయం 8గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.