‘నన్నెందుకు వీఐపీలా చూస్తున్నారు..’
న్యూఢిల్లీ: సాధారణంగా తనను ప్రత్యేకంగా చూడాలని, వీఐపీలా ట్రీట్ చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మాత్రం తనను వీఐపీలా చూసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ’నేను కూడా అందిరిలాంటి మనిషినేగా ఎందుకు ప్రత్యేకంగా పరిగణిస్తూ మానసికంగా వేధిస్తారు’ అని ఆయనకు కలిగిన ఇబ్బందిని బయటపెట్టారు. మధ్యప్రదేశ్ నుంచి కొత్తగా రాజ్యసభకు వివేక్ తనఖా అనే వ్యక్తి ఎన్నికయ్యారు. ఆయన జబల్పూర్ నుంచి ఢిల్లీకి ఒక కార్యక్రమంపై వెళ్లారు. ఆ సమయంలో ఆయనతోపాటు ఓ లోక్ సభ సభ్యుడు కూడా ఉన్నాడు. స్పైస్ జెట్ విమానంలో వారిద్దరు వెళ్లారు.
అయితే, ఢిల్లీ విమానాశ్రయం చేరుకోగానే ముందుగా తమకు మాత్రమే ఫ్లైట్ దిగిపోయే అవకాశం ఇచ్చి మిగితా ప్రయాణికులను కొద్ది సేపు ఆపేశారని, తాము పూర్తిగా వెళ్లిపోయాక వారిని వదిలారని, ఇది ఏమాత్రం గర్హించరాని విషయం అంటే స్పైస్ జెట్ కు ఫిర్యాదు చేశారు. తాము కూడా మిగితా ప్రయాణికుల్లాంటి వారిమేనని చెప్పారు.‘నేను చాలా తీవ్రంగా బాధపడ్డాను. నేను అందరిలాంటి ప్రయాణికుడినే. వారికి ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారో నాకు వాటినే వర్తింపజేయాలి. నన్ను కూడా ఒక పౌరుడిగా పరిగణించినప్పుడు ప్రత్యే్క సేవలు, మర్యాద అవసరం లేదనే చెప్తాను. మీకు వీలైతే వీఐపీలా ఎంపీలను, లేదా కొంతమందిని ట్రీట్ చేయడం మానేయండి. అదీ కుదరకుంటే.. కనీసం నన్నయినా వీఐపీలా ట్రీట్ చేయడం మానండి’ అంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.