లోక్‌సభ స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌? | Virendra Kumar to be pro-tem speaker of Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌?

Published Wed, Jun 12 2019 7:57 AM | Last Updated on Wed, Jun 12 2019 8:03 AM

 Virendra Kumar to be pro-tem speaker of Lok Sabha - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ దళిత నేత, గత మంత్రి వర్గ సభ్యుడైన వీరేంద్ర కుమార్‌ ఖతిక్‌(65) 17వ లోక్‌సభ స్పీకర్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన ఈ దళిత నేతను లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మంగళవారం ప్రభుత్వం నియమించింది. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా ఎంపీలు భర్తృహరి మహ్తాబ్, కొడికునిల్‌ సురేశ్, బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌లను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారని అధికార వర్గాలు తెలిపాయి. ఎంపీ వీరేంద్రకుమార్‌ ఖతిక్‌ 17వ లోక్‌సభ మొట్ట మొదటి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించడంతోపాటు స్పీకర్‌ ఎన్నికను ఆయన పర్యవేక్షిస్తారు. 

ఎనిమిది పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన మనేకా గాంధీ ప్రొటెం స్పీకర్‌ అవుతారని మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ మంత్రి వర్గంలో చోటుతోపాటు ప్రొటెం స్పీకర్‌ పదవి కూడా ఆమె తిరస్కరించినట్లు సమాచారం. దీంతో మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన సీనియర్‌ నేత వీరేంద్రకుమార్‌ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. స్పీకర్‌ పదవి కూడా వీరేంద్ర కుమార్‌కే దక్కే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ పదవి రేసులో కేంద్ర మాజీ మంత్రులు రాధా మోహన్‌ సింగ్, జుయెల్‌ ఓరమ్, ఎస్‌ఎస్‌ అహ్లూవాలియా కూడా ఉన్నారు. 17వ లోక్‌సభ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి జూలై 26 వరకు జరగనున్నాయి. 17, 18వ తేదీల్లో కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం, 19వ తేదీన స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement