![ఔను! సైన్యం అనుమానాస్పద కదలిక నిజమే!](/styles/webp/s3/article_images/2017/09/3/81452409067_625x300.jpg.webp?itok=yd3X7vP3)
ఔను! సైన్యం అనుమానాస్పద కదలిక నిజమే!
- కాంగ్రెస్ నేత మనీష్ తీవారి వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన వీకే సింగ్
న్యూఢిల్లీ: మూడేళ్ల కిందట హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా సైన్యం అనుమానాస్పదంగా కదిలిన ఘటన నిజమేనంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మనీష్ తివారి పేర్కొనడం రాజకీయ దుమారం రేపుతోంది. మనీష్ తీవారి వ్యాఖ్యలను ఆర్మీ మాజీ చీఫ్, కేంద్రమంత్రి వీకే సింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. 'మనీష్ తివారీకి ఏ పని లేదు. ఇందుకు సంబంధించిన నా పుస్తకం ఒకటి ఉంది. దానిని చదవమనండి. ఆయనకే అంతా తేటతెల్లం అవుతుంది' అని వీకే సింగ్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మనీష్ తివారీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సైన్యం అనుమానాస్పద కదలిక వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.
2012లో జరిగిన ఈ ఘటన దురదృష్టకరమైనది అయినప్పటికీ నిజమేనని మనీష్ తివారి పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన ఆహూతుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 'ఆనాటి రాత్రి రైసినా హిల్స్ భయభ్రాంతులకు లోనైంది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే రెండు ఆర్మీ యూనిట్లు (2012 ఏప్రిల్ 4న) ఢిల్లీ వైపుగా కదిలాయి. ఇది దురదృష్టకరం అయినప్పటికీ, నిజం' అని చెప్పారు. తాను అప్పుడు రక్షణశాఖపై పార్లమెంటు స్థాయీ సంఘంలో ఉన్నానని, తనకు తెసినంతవరకు ఇది నిజంగా జరిగిన ఘటనేనని అన్నారు.