‘ఢిల్లీ వైపు సైన్యం’ నిజమే... | VK Singh rubbishes Manish Tewari's troop movement claim | Sakshi
Sakshi News home page

‘ఢిల్లీ వైపు సైన్యం’ నిజమే...

Published Mon, Jan 11 2016 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

‘ఢిల్లీ వైపు సైన్యం’ నిజమే...

‘ఢిల్లీ వైపు సైన్యం’ నిజమే...

► 2012లో సైనిక దళాల కదలికలపై నాటి కేంద్ర మంత్రి మనీశ్ తివారీ స్పష్టీకరణ
► అప్పుడు ఆర్మీ చీఫ్‌గా ఉన్నది నేటి కేంద్ర మంత్రి వీకే సింగ్
► అప్పట్లో యూపీఏ సర్కారుకు, వీకే సింగ్‌కు మధ్య విభేదాలు!
► సుప్రీంకోర్టు దాకా వెళ్లిన సింగ్ ‘పుట్టినరోజు’ రగడ
► తివారీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్
► పనిలేని వ్యాఖ్యలన్న వీకే సింగ్

న్యూఢిల్లీ: 2012లో నాటి ఆర్మీ చీఫ్, నేటి కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటుకు ప్రయత్నం జరిగిందన్న వార్త తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చి సంచలనం సృష్టించింది. ‘జనవరి 16, 2012 రాత్రి కీలకమైన రెండు సైనిక దళాలు.. ఒకటి హరియాణాలోని హిసార్ కేంద్రంగా ఉన్న దళం, మరొకటి ఆగ్రాలోని 50వ పారా బ్రిగేడ్.. అనూహ్యంగా, ప్రభుత్వానికి కానీ, మంత్రిత్వ శాఖకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. దేశ రాజధాని ఢిల్లీ వైపునకు కదిలాయి. ఈ విషయాన్ని కేంద్ర నిఘా విభాగం ప్రభుత్వానికి నివేదించింది’ అంటూ ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఏప్రిల్ 4న ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తను అప్పుడే ఆర్మీ ఖండించింది.


తాజాగా శనివారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ ఆ ఘటనను ప్రస్తావించారు. ‘ఆ ఘటన దురదృష్టకరమే కానీ వాస్తవం. నేనప్పుడు రక్షణ రంగ స్థాయీ సంఘంలో సభ్యుడిగా ఉన్నాను’ అని తివారీ వ్యాఖ్యానించడంతో సైనిక కుట్ర అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్ ఘటన జరిగిన సమయంలో సైనిక దళాల ప్రధానాధికారిగా ఉన్నారు. ఆయన జన్మదినానికి సంబంధించిన ఒక వివాదంపై ఆ రోజే(2012, జనవరి 16న) సుప్రీంకోర్టులో కేసు వేశారు. అదే వివాదానికి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏతో జనరల్ వీకే సింగ్‌కు విబేధాలు పొడచూపాయన్న వార్తలూ అప్పుడు ప్రచారంలో ఉన్నాయి. దాంతో సైనిక కుట్రకు జనరల్ సింగ్ ప్రయత్నించారన్న వాదన వినిపించింది. కానీ ఆ వార్తలను నాటి యూపీఏ ప్రభుత్వం, ఆర్మీ ఆ వెంటనే ఖండించాయి.
 

కాగా, మనీశ్ తివారీ చేసిన తాజా వ్యాఖ్యలు సొంతపార్టీ కాంగ్రెస్‌ను సైతం ఇరుకున పెట్టాయి. దాంతో, తివారీ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ‘సైనిక దళాల కదలికకు సంబంధించిన కథనం అవాస్తవం. ఆర్మీ యూనిట్స్‌లో అలాంటి కదలికలు సహజమే.. సాధారణమే. వాటిపై ఇప్పుడు మాట్లాడటం అసందర్భం.. అనవసరం.. తప్పు కూడా. అదీకాక మా సహచరుడు(మనీశ్ తివారీ) అప్పుడు భద్రతపై కేబినెట్ కమిటీలోనే కాదు.. సంబంధిత నిర్ణయాలు తీసుకునే ఏ విభాగంలోనూ సభ్యుడు కాదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వివరణ ఇచ్చారు. సంబంధం లేని విషయాలపై ఇకపై మాట్లాడవద్దంటూ తివారీని సున్నితంగా హెచ్చరించారు. మరోవైపు, తివారీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, నాటి ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ మండిపడ్డారు.


‘ప్రస్తుతం ఏ పనీ లేని వ్యక్తి నుంచి ఆ వ్యాఖ్యలు వచ్చాయం’టూ తిప్పికొట్టారు. నాటి ఘటనలను తాను రాసిన పుస్తకంలో స్పష్టంగా వివరించానని, ముందు ఆ పుస్తకం చదవమని తివారీకి సలహా ఇచ్చారు. అయితే, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మనీశ్ తివారీ ఆదివారం స్పష్టం చేశారు. తివారీ తాజా వ్యాఖ్యలపై నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, అప్పుడు రక్షణమంత్రిగా ఉన్న ఏకే ఆంటోనీ వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆర్మీలో నైతిక స్థైర్యం దెబ్బదీసేలా రాజకీయ కుట్రలకు పాల్పడటం కాంగ్రెస్‌కు అలవాటేనని బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ విమర్శించారు. పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో చర్చించిన అంశాలను బహిరంగపర్చకపోవడం పార్లమెంటరీ సంప్రదాయమని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్మీ కదలికలపై వచ్చిన వార్తలను అప్పుడే ఆర్మీ, యూపీఏ ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement