తొలి లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఐదు రెట్ల పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 81.45 కోట్లకు చేరుకుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. తొలి సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే ఓటర్లు దాదాపు ఐదు రెట్లు పెరిగారని తెలిపింది. త్వరలో 16వ లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం 1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17,32,12,343 ఉంటే.. వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 81,45,91,184 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2009 సాధారణ ఎన్నికల నాటితో పోలిస్తే ఓటర్లు 9,75,06,083 మంది పెరిగారు.
1998తో పోలిస్తే 34 శాతం పెరిగింది. దేశంలో అతి ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్(80)లో భారీగా ఓటర్ల పెరుగుదల నమోదైంది. 1998లో యూపీలో 10.19 కోట్ల మంది ఓటర్ల ఉండగా.. ప్రస్తుతం 13.43 కోట్లకి చేరింది. దేశం మొత్తం ఓటర్లలో యూపీ వాటా 16.5 శాతం కావడం విశేషం. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో 49.1 శాతం మంది ఓటర్లు ఉన్నారు. సిక్కిం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, నాగాలాండ్ కలిస్తే 0.5 శాతం మంది ఓటర్లు కూడా లేకపోవడం గమనార్హం. 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను పరిశీలిస్తే... దాద్రా నగర్ హవేలీలో అత్యధిక ఓటర్ల పెరుగుదల రేటు నమోదైంది. 2004 నుంచి 2014 మధ్య ఇక్కడ 53.9 శాతం కొత్త ఓటర్లు నమోదయ్యారు. పుదుచ్చేరి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 39.1 శాతం పెరుగుదల నమోదైంది. రాష్ట్రాల విషయానికి వస్తే పశ్చిమబెంగాల్ అత్యధికంగా 31.7 శాతం పెరుగుదల రేటును నమోదు చేసుకుంది. మొత్తం ఓటర్లలో 98.27 శాతం రాష్ట్రాల్లో ఉంటే.. 1.73 శాతం కేంద్ర పాలిత ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
ఎన్నికల సంవత్సరం ఓటర్ల సంఖ్య
1951-52 17,32,12,343
1998 60.58,80,192
2009 71.69,85,101
2013-14 81.45,91,184