మోదీ కుర్తా వేసుకోవాలని ఉంది
భారత్, అమెరికాల మధ్య 'దోస్తీ' పెరగాలని, తనకు మోదీ కుర్తా వేసుకోవాలని ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నల్లటి సూటు, టై కట్టుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు హాజరైన ఒబామా చాలా ఉల్లాసంగా కనిపించారు. 2010 సంవత్సరంలో తాను తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పటి విశేషాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆరోజు తమ దంపతులతో డాన్సు చేయించారని అన్నారు. ముంబైలో కొందరు పిల్లలతో కలిసి మిషెల్ ఒబామా, బరాక్ ఒబామా డాన్సు చేశారు. తనకంటే మిషెల్ బాగా డాన్సు చేస్తారని ఆయన అన్నారు.
కేవలం మూడు గంటల నిద్ర సరిపోతుందని, మిగిలిన 21 గంటలూ తాను పనిచేస్తానని ప్రధాని నరేంద్రమోదీ తనతో అన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ఒబామా తెలిపారు. తాను కనీసం ఐదు గంటలు పడుకోవాలని చెప్పారు. అలాగే, మొసలి దాడి నుంచి ఒకసారి తప్పించుకున్న విషయం కూడా తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. ఆయన చాలా గట్టి మనిషని, మంచి స్టైలు కూడా ఉందని అన్నారు. ఒకప్పుడు మోదీ తండ్రి టీ అమ్ముకునేవారని, ఆయన తల్లి ఇళ్లలో పనిచేసుకునే వారని, కానీ వాళ్ల అబ్బాయి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా మన ముందున్నారని ప్రశంసల్లో ముంచెత్తారు.