సమాజ్‌వాదీలో పరివార్ | War in the Samajwadi Party | Sakshi
Sakshi News home page

సమాజ్‌వాదీలో పరివార్

Published Tue, Oct 25 2016 1:36 AM | Last Updated on Sat, Aug 25 2018 5:02 PM

సమాజ్‌వాదీలో పరివార్ - Sakshi

సమాజ్‌వాదీలో పరివార్

పార్టీ సమావేశంలో వీధికెక్కిన కుటుంబ విభేదాలు
- ములాయం, అఖిలేశ్, శివ్‌పాల్‌ల మధ్య మాటల తూటాలు
- నాన్న ఆదేశిస్తే తప్పుకుంటా, కొత్త పార్టీ ఎందుకు పెట్టాలి?: అఖిలేశ్
- నీ సామర్థ్యమెంత? ఎన్నికల్లో గెలవగలవా? అమర్ సోదరుడితో సమానం : ములాయం
- సీఎం పగ్గాలను ములాయం చేపట్టాలి: శివ్‌పాల్  
 
 లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ కలహాలు సోమవారం రోడ్డెక్కాయి. పార్టీ నేతలు, కార్యకర్తల సాక్షిగా బాబాయ్, అబ్బాయ్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒక దశలో ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. తండ్రి ములాయం, కొడుకు అఖిలేశ్, బాబాయ్ శివపాల్‌లు మాటల తుటాలతో తలపడ్డారు. తండ్రి ఆదేశిస్తే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని అఖిలేశ్ స్పష్టం చేయగా... తమ్ముడు శివపాల్, స్నేహితుడు అమర్‌సింగ్‌ల పక్షాన నిలిచిన ములాయం... ‘నువ్వెంత? నీ సామర్థ్యమెంత? గీత దాటితే సహించన’ంటూ కొడుకును తీవ్రంగా హెచ్చరించారు. సీఎంను మార్చే ఉద్దేశం లేదనీ స్పష్టం చేశారు. మరోవైపు కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ భేటీలో, వెలుపల నినాదాలతో హోరెత్తించారు.

మూడు నెలల అంతర్గత కుమ్ములాటలకు ముగింపు పలికేందుకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ లక్నోలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన భేటీ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది. అఖిలేశ్, శివ్‌పాల్‌లు వేదికపైనే గొడవపడడంతో రాజీ లేకుండానే భేటీ అర్ధంతరంగా ముగిసింది. సమావేశానికి అఖిలేశ్ హాజరై అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు  ఆవేశంగా ప్రసంగించారు. ములాయం కోరితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని, కొత్త పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. ‘ఎవరు నిజాయతీ పరులని ములాయం భావిస్తే వారిని సీఎంగా నియమించండి. నేనేందుకు కొత్త పార్టీ పెట్టాలి?’ అని ప్రశ్నించారు.

 తండ్రే నాకు గురువు.. అఖిలేశ్: ‘నా తండ్రే నాకు గురువు... చాలా మంది మా కుటుంబంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏదైనా తప్పు జరిగితే ఎలా ఎదుర్కోవాలో సొంతంగా నేర్చుకున్నా’ అంటూ అమర్‌పై పరోక్ష విమర్శలు చేశారు. అక్టోబర్‌లో భారీ మార్పు జరుగుతుందంటూ అతను(అమర్) ముందే చెప్పాడని వెల్లడించారు. పార్టీ రజతోత్సవాలకు సీఎం రాకపోవచ్చని అందరూ భావించగా. ‘నా రథయాత్ర కొనసాగుతుంది... వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటాం’ అని స్పష్టం చేశారు.తన పరిధి దాటి ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు.

 శివ్‌పాల్ కృషిని మర్చిపోలేను: ములాయం
 ఎస్పీ  క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందని, పార్టీ సభ్యులు ఒకరితో ఒకరు గొడవపడొద్దని ములాయం  సూచించారు. ‘అమర్, శివ్‌పాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే సహించను. నేను జైలుకు వెళ్లకుండా అమర్ నన్ను కాపాడారు. అతను నాకెంతో సాయం చేశారు. అమర్ నాకు సోదరుడితో సమానం. కేవలం ఎర్ర టోపీ పెట్టుకుంటే సమాజ్‌వాదీ సభ్యులు కారు. కొందరు మంత్రులు భజనపరులు. శివపాల్  కృషిని నేను మర్చిపోలేను. శివ్‌పాల్ ప్రజానేత.పార్టీ బలోపేతానికి నేనెంతో కష్ట్టపడ్డా. లోహియా సిద్ధాంతాల్ని అనుసరించి పేదలు, రైతుల కోసం పోరాడాను’ అని పేర్కొన్నారు. ఒక దశలో అఖిలేశ్‌ను ఉద్దేశించి... ‘నీ సామర్థ్యం ఎంత? నువ్వు ఎన్నికల్లో గెలవగలవా? విమర్శల్ని సహించలేనివారు నేతలు కాలేరు. విమర్శ సరైనదైతే, అభివృద్ధి చెందేందుకు అవకాశముంటుంది’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

 అమర్‌లో నాలుగో వంతు చేయవు: శివ్‌పాల్
 అఖిలేశ్‌పై తొలిసారి బాబాయ్ శివపాల్ బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త పార్టీ పెడతానని సీఎం నాతో చెప్పారు. అలాగే కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటానన్నారు. ఈ విషయంలో గంగాజలంపై ప్రమాణం చేస్తా. ఉత్తరప్రదేశ్ పాలనా పగ్గాలు చేపట్టమని అన్నయ్యను కోరుతున్నా’ అని ఉద్వేగంతో అన్నారు. ‘నీ విలువ అమర్‌లో నాలుగో వంతు కూడా చేయదు’ అని అఖిలేశ్‌ను పరోక్షంగా తప్పుపట్టారు. మాఫియా డాన్ ముక్తార్ అన్సారీకి చెందిన క్యూఈడీ పార్టీ ఎస్పీ విలీన అంశంపై స్పందిస్తూ.. అ న్సారీని పార్టీలోకి ఎప్పుడూ తీసుకోలేదన్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులు సులువుగా గెలిచేందుకు విపక్ష ఎమ్మెల్యేల మద్దతుకు ఎంతో కృషి చేశానని తెలిపారు. ‘ప్రభుత్వ ఏర్పాటులో నా పాత్ర ఏమీ లేదా? నా ఆధ్వర్యంలోని శాఖలు సమర్థంగా పనిచేయలేదా? విపక్ష నేతలూ నా పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. నేను ఏది సరిగా చేయలేదో సీఎం చెప్పాలి. నన్ను ఆహ్వానించకపోయినా... నేను సీఎం ఇంటికి వెళ్లేవాడిని’ అని అన్నారు. అఖిలేశ్, శివపాల్ వర్గాలకు చెందిన కార్యకర్తలు తామేం తీసిపోలేదంటూ లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పరస్పరం నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.

 అఖిలేశ్‌కు నా ఆశీస్సులు: అమర్‌సింగ్
 తనపై ఆరోపణలు, ప్రశ్నలకు కొన్నిసార్లు మౌనం మంచి సమాధానం అవుతుందని అమర్ సింగ్ అన్నారు. అఖిలేశ్  తమ అధినేత కుమారుడని, అతనికి తన ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు.
 
 మళ్లీ సయోధ్య?
 ములాయంతో అఖిలేశ్, శివ్‌పాల్ భేటీ
 
 సాక్షి, న్యూఢిల్లీ: అఖిలేశ్, శివపాల్‌ల మధ్య సోమవారం గొడవ అనంతరం తాత్కాలిక సంధి కోసం ములాయం పావులు కదిపారు. సీఎంగా అఖిలేశ్ కొనసాగుతారని, పార్టీ బాధ్యతలు శివ్‌పాల్ చూసుకుంటారనే ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఇక మాట్లాడేది లేదని, తన ఆరోగ్యం సరిలేదని ములాయం స్పష్టం చేశారు. ఇరు వర్గాలు కొంత మేర శాంతించాయని, త్వరలోనే సంధి కుదిరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సోమవారం రాత్రి అఖిలేశ్, శివపాల్‌లు ములాయంతో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువ పార్టీ టికెట్లు తమ వర్గీయులకే ఇప్పించుకునే క్రమంలో ఈ కుమ్ములాటలు మొదలయ్యాయని భావిస్తున్నారు.

సీఎంకు అనుకూలంగా ఉన్నవారికి టికెట్లు ఇస్తే పార్టీ ఓటమి తప్పదని శివ్‌పాల్ వాదన. తమ వర్గీయులకు టికెట్లు రాకుండా అడ్డుపడుతున్నారనేది అఖిలేశ్ ఆరోపణ. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలో తానే నిర్ణయిస్తానని ములాయం వారిద్దరికీ స్పష్టం చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితులలో ఉందని, ఈ సమయంలో ఆధిపత్యం కోసం గొడవ అవివేకమని ములాయం చెప్పారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈ కుమ్ములాటలతో పలు వర్గాలతో పాటు ప్రత్యేకించి మైనార్టీలకు పార్టీ దూరమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్పీ తగాదాలతో బహుజన్ సమాజ్ పార్టీ లబ్ది పొందే అవకాశం ఉందనేది వారి విశ్లేషణ.

అఖిలేశ్ సీఎంగా ఉన్నా.. పాలనలో ములాయం జోక్యం కొనసాగుతూనే ఉం ది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న అనితాసింగ్ ద్వారా వ్యవహారాల్ని ములాయం చక్కబెట్టేవారు. ఈ విషయంలో అఖిలేశ్ అసంతృప్తిగా ఉన్నారు. అలాగే కీలక శాఖలైన నీటి పారుదల, పీడబ్ల్యూడీ(ప్రజా పనులు)  శివ్‌పాల్ ఆధ్వర్యంలో ఉండడం తో భారీ ప్రాజెక్టులు ఆయన కనుసన్నల్లో నడిచేవి. ఆ శాఖలకు సంబంధించి తన మాట చెల్లుబాటు అవ్వకపోవడం అఖిలేశ్‌కు ఆగ్రహం తెప్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement