కోల్‌కతా: ప్రాణాంతక వ్యాధి సోకగానే ముందుగా అధిగమించాల్సింది భయాన్ని. కుటుంబ సభ్యుల అండతో, వైద్యులు నూరిపోసిన ధైర్యంతో కరోనానే జయించిందో యువతి. కోల్‌కతాకు చెందిన 24యేళ్ల మోనమి బిశ్వాస్ ఈడెన్‌బర్గ్‌లో విద్యనభ్యసిస్తోంది. ప్రపంచ దేశాలకు కరోనా పాకుతున్న వేళ ఆమె సొంతగూటికి చేరుకుంది. అదే సమయంలో తనకు వచ్చిన జ్వరం మామూలుది కాదని తెలుసుకుని షాక్‌కు లోనైంది. రెండు వారాల చికిత్స అనంతరం వైరస్ బారి నుంచి బయటపడింది. ఈ నేపథ్యంలో కరోనాతో చేసిన పోరాటం గురించి ఆమె మాటల్లోనే.. "మార్చి 19న నేను ముంబై మీదుగా కోల్‌కతాకు చేరుకున్నాను. అప్పటికే నాకు జ్వరం ఉండటంతో పారాసిటమాల్ మాత్ర వేసుకున్నాను. (మహిళగా మారి పెళ్లి.. ఆపరేషన్ వికటించి..)
ఒంటరితనం ఫీలయ్యా
అయితే అక్కడి అధికారులు నిబంధనల ప్రకారం నాకు కోవిడ్-19 టెస్ట్ చేయాలన్నారు. దానికి నేను అంగీకరించగా పరీక్షలో పాజిటివ్ అని తేలింది. దీంతో నన్ను ఐసోలేషన్ రూమ్‌కు తరలించారు. నేనున్న గదిలో అన్నిరకాల వైద్య పరికరాలున్నాయి, కానీ నేను ఒంటరిగా ఉన్నాను. అయితే మొబైల్ ఫోన్ వాడుకోడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. పైగా వార్తాపత్రికలు కూడా పంపారు, కావాలంటే ల్యాప్‌టాప్ కూడా వాడుకోమన్నారు. డాక్టర్లు తరచూ వచ్చి నాలో ధైర్యాన్ని నింపేవారు, అయితే నన్ను సమీపించే ప్రతీసారి మాస్క్ ధరించమని కోరేవారు. అలాంటి కష్ట కాలంలో నా కుటుంబం కూడా నాకు ఎంతో మద్దతుగా నిలిచింది. వారితో అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడేదాన్ని. నెట్‌ఫ్లిక్స్ కూడా చూసేదాన్ని. (ఢిల్లీలో ఇద్దరు డాక్టరకు కరోనా పాజిటివ్)
కరోనా వచ్చిందని తెలియగానే చిగురుటాకులా వణికిపోయాను
వైద్య సదుపాయాలతో పోల్చితే యూకే కన్నా కూడా భారతదేశమే ఎంతో నయం. కరోనా గురించి విన్నాక నేను మార్చి 17న యూకే ఎంబసీ అధికారులను సంప్రదించాలని చూశాను, కానీ వాళ్ల దగ్గర నుంచి కనీస స్పందన కరువైంది. దీంతో నేను భారత్‌కు తిరిగి రావడమే అత్యుత్తమని నిశ్చయించుకున్నాను. కరోనా సోకిందని తెలియగానే మొదటి రోజు భయంతో వణికిపోయాను. అయితే నాకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉందని, ఈ వైరస్‌ను అధిగమిస్తానని వైద్యులు నిరంతరం నాలో ధైర్యం నూరిపోసేవారు.
మనకు సహాయం చేయగలిగేది వాళ్లు మాత్రమే
ప్రజలకు నేను చెప్పదల్చుకునేదేంటంటే.. కరోనా గురించి అతిగా భయపడాల్సిన పని లేదు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి, ఎందుకంటే మనకు సహాయం చేయగలిగేది వాళ్లు మాత్రమే. కానీ ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. అందులో భాగంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోండి, ఇంట్లోనే ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి" అంటూ పలు సూచనలు చేసింది. ఇక కరోనాతో యుద్ధంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇంకా అనేకమందికి మోనమి మనస్ఫూర్తిగా హ్యాట్సాఫ్ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment