‘పొత్తెందుకు?’ కొడుకుపై ములాయం గుస్సా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చురకలంటించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూటమి ఏర్పాటుచేసే విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరితోనూ ముఖ్యంగా బీఎస్పీతో పొత్తు అవసరం లేదని, సొంతంగా గెలుచుకునే సత్తా పార్టీకి ఉందని అఖిలేశ్‌కు గట్టిగా చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఆ దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేయాలి తప్ప ఇలా పొత్తుల గురించి మాట్లాడొద్దని గట్టిగా మందలించినట్లు కూడా తెలిపారు.
‘భారీ కూటమి ఉండాల్సిందే. మేం దానికి మద్దతిస్తాం’ అని అఖిలేశ్ యాదవ్ చెప్పిన ఒక రోజులోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ తాము కూడా భారీ గ్రాండ్ అలయెన్స్‌కు సిద్ధమేనని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీతోనైనా జతకడతామని తెలిపారు. సమాజ్‌వాది పార్టీ ఇందుకు మినహాయింపు ఏం కాదని, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నుంచి రక్షించేందుకు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటామని అన్నారు. దీంతో వెంటనే అఖిలేశ్ వెళ్లి ఈ విషయాన్ని ములాయంకు విన్నవించగా ‘ఒంటరిగా గెలిచ్చే సత్తా మన పార్టీకి ఉంది.. అసలు పొత్తులు ఎందుకు’ అని అన్నారంట.