'మేమేం వానలు పుట్టించలేం.. వాళ్లకివ్వడానికి..'
బెంగళూరు: సర్దుమణిగిన కావేరి వివాదం మరోసారి తెరపైకి వచ్చేలాగా కర్ణాటక మంత్రి ఒకరు వ్యాఖ్యలు చేశారు. 'వర్షాలను మేం పుట్టించడం లేదు మీకు నీళ్లు ఇవ్వడానికి' అంటూ చాలా ఆగ్రహంగా సమాధానం చెప్పారు. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని ఎందుకు తగ్గించారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కర్ణాటక జల వనరులశాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందిస్తూ తన రెండు చేతులను గాల్లోకి విసురుతూ..
'చాలా రోజులుగా వర్షాలు రావడం లేదు. అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. మేం వర్షాలను పుట్టించడం లేదు. నీటిని ఉత్పత్తి చేయడం లేదు. జూన్ 1 నుంచి తమిళనాడుకు విడుదల చేయాల్సిన మొత్తం 44 టీఎంసీ అడుగులు. కానీ, మేం 2.2 టీఎంసీల అడుగల నీటిని విడుదల చేయగలిగాం. కానీ, వాస్తవానికి విడుదల చేయడానికి ఇంకా నీరు లేదు. తమిళనాడు మాత్రం మాపై ఒత్తిడి చేస్తోంది. కానీ, మాకు వర్షాలే రావడం లేదు, క్యాచిమెంట్ వాటర్ తక్కువగా ఉంది. వర్షాలు అనేది ప్రకృతితో ముడిపడిన అంశం. మా చేతుల్లో ఏం లేదు. మేం వానలు పుట్టించడం లేదు' అని చెప్పారు.