కేంద్రం వైఖరిని అంగీకరించం
కొలీజియం సిఫారసుల తిరస్కరణపై సుప్రీంకోర్టు
- ఆ 43 పేర్లను పునఃపరిశీలనకు పంపినట్లు వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫారసు చేసిన 43 పేర్లను తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంభించిన వైఖరిని తాము అంగీకరించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ 43 పేర్లను పునఃపరిశీలనకు తిప్పి పంపినట్లు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఏఆర్ దవేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది. ఈ అంశంపై గత మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం చేసిన నివేదనను అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ప్రస్తావించగా.. కోర్టు ఈ మేరకు ప్రకటన చేసింది. ‘దాన్ని మేం చూశాం..’ అని ఐదుగురు సభ్యుల కొలీజియంకు నేతృత్వం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే ఆ విషయం తనకు తెలియదని ఏజీ చెప్పారు. దీనిపై తదుపరి విచారణను శీతాకాలపు సెలవుల తర్వాత చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
కొలీజియం సిఫారసు చేసిన 77 పేర్లకు గాను 34 పేర్లకు తాము ఆమోదం తెలిపినట్లు మంగళవారం నాటి విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకు తెలిపింది. జడ్జీల నియామకంపై సిఫారసుల సంబంధిత ఫైలేదీ తమ వద్ద పెండింగ్‌లో లేదంది. 34 పేర్లను ఆమోదించామని, మిగతా 43 పేర్లను న్యాయస్థానానికి తిప్పి పంపినట్లు ఏజీ గత మంగళవారం ధర్మాసనానికి నివేదించారు. కొలీజియం సిఫారసుల తర్వాత కూడా న్యాయమూర్తుల నియామకంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీం గతంలోనే కేంద్రాన్ని నిలదీసింది. ఫైళ్ల నత్తనడకపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు అవసరమైతే పీఎంవో, న్యాయ శాఖ కార్యదర్శులను కోర్టుకు పిలుస్తామని కూడా హెచ్చరించింది. కాగా, శుక్రవారం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవేకు చివరి పనిరోజు కావటంతో ఆయన పదవీ విరమణ తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ పదవీ కాలం వచ్చే జనవరి 3న ముగియనుంది. ఈయన స్థానంలో జస్టిస్ జేఎస్ ఖేహర్ బాధ్యతలు స్వీకరిస్తారు.