న్యాయ వ్యవస్థ తన సెలవు దినాలను తగ్గించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన సూచనకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్పందించారు.
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ తన సెలవు దినాలను తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన సూచనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. 'మేం ఏమైనా సెలవుల్లో ఎంజాయ్ చేస్తామా? మనాలీ వంటి తదితర హిల్‌స్టేషన్లకు పోయి ఎంజాయ్ చేస్తామనుకుంటున్నారా? తీర్పులను ఎవరు రాస్తారు? ముఖ్యంగా రాజ్యాంగ ధర్మాసన తీర్పులను ఎవరు రాస్తారు? అసలు విషయం తెలుసుకోండి.. మాకు మూడు వారాలు మాత్రమే బ్రేక్ లభిస్తుంది. నా సహచరుడు (జస్టిస్ జేఎస్ ఖేహార్) బ్రేక్ సమయంలో జాతీయ న్యాయ నియామక కమిషన్ (ఎన్‌జేఏసీ)పై విచారించారు. సెలవుల సమయంలో తీర్పును రాశారు' అని చీఫ్ జస్టిస్ ఠాకూర్ చెప్పారు.
ఆదివారం ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో చీఫ్ జస్టిస్ ఠాకూర్ భావోద్వేగ ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ మీద పని భారం మోపడం సరైంది కాదని అన్నారు. అమెరికాలో ఏడాదికి ఒక న్యాయమూర్తి 81 కేసులను పరిష్కరిస్తుంటే ఇండియాలో 2,600 కేసులను పరిష్కరించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జడ్జీలు సెలవులు తగ్గించుకోవాలన్న సూచనపైనా చీఫ్ జస్టిస్ ఘాటూగా స్పందించారు.