'అతడికి తుపాకీ లైసెన్స్ ఇచ్చింది మేమే'
న్యూఢిల్లీ/పట్నా: హత్య కేసులో ఇరుకున్న జేడీ(యూ) మహిళ ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్ కు తుపాకీ లైసెన్స్ ఇచ్చింది తామేనని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. 2013లో అతడికి లైసెన్స్ మంజూరు చేసామని ఢిల్లీ పోలీసు విభాగం సమాచార అధికారి శుక్రవారం తెలిపారు. అతడిపై మోపిన అభియోగాలపై బిహార్ పోలీసుల నుంచి నివేదిక రాగానే రాకీ యాదవ్ తుపాకీ లైసెన్స్ ను రద్దు చేస్తామని చెప్పారు.
తన కారును దాటి వెళ్లిపోయాడనే కోపంతో నడిరోడ్డుపై ఆదిత్య సచ్ దేవా అనే యువకుడిని కాల్చి చంపాడన్న ఆరోపణలతో రాకీ యాదవ్ ను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాకీ యాదవ్ తండ్రి బిండి యాదవ్, ఎమ్మెల్సీ మనోరమా బాడీగార్డ్ రాజేశ్ కుమార్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆదిత్య సచ్ దేవా కుటుంబానికి బిహార్ పోలీసులు భద్రత కల్పించారు.