Rocky Yadav
-
రాఖీ యాదవ్‌కు యావజ్జీవం
పట్నా : జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాఖీ యాదవ్‌కు గయా కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న అక్కసుతో ఓ యువకుడిని కాల్చి చంపిన కేసులో రాఖీ యాదవ్‌తో పాటు మరో ఇద్దరికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన రాఖీయాదవ్ తండ్రి బింది యాదవ్‌కు ఐదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా గయాలో 2016, మే 7న తన వాహనాన్ని ఓవర్టేక్ చేసినందుకు ఇంటర్ విద్యార్థి ఆదిత్య సచ్దేవ్ను రాకీ యాదవ్ హత్య చేసినట్టు కోర్టు ఇప్పటికే నిర్థారించింది. ఇందుకు సంబంధించి రాఖీ యాదవ్‌కు ఇవాళ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. మరోవైపు న్యాయస్థానం తీర్పుపై మృతుడు ఆదిత్య సచ్దేవ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. గత 15 నెలలుగా ఈ కేసులో పలు మలుపులు చోటుచేసుకున్నాయి. రాఖీకి అప్పటి పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్బాల్ అహ్మద్ అన్సారీ గత అక్టోబర్‌లో బెయిల్ మంజూరు చేయగా, సుప్రీం కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులైన ఆదిత్య స్నేహితులు నలుగురు భిన్నంగా స్పందించడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు మధ్యలో మారిపోవడం వంటి అవరోధాలు ఎదురయ్యాయి. మరోవైపు రాఖీ తండ్రి బిందీ యాదవ్.. ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దింపడంతో ప్రాసిక్యూషన్ చివరికి శాస్త్రీయ ఆధారాలపైనే కేసులో నెగ్గుకొచ్చింది. -
కోర్టులో లొంగిపోయిన రాఖీ యాదవ్
పట్నా: టీనేజ్ యువకుడి హత్య కేసులో నిందితుడు రాకేశ్ రంజన్ అలియాస్ రాఖీ యాదవ్ శనివారం ఉదయం గయా సివిల్ కోర్టులో లొంగిపోయాడు. కాగా రాఖీ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ బిహార్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో రాఖీ యాదవ్ లొంగిపోవడంతో అతడికి న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కుమారుడితో పాటు బహిష్కృత జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి, ఆమె భర్త కూడా కోర్టుకు వచ్చారు. ఈ ఏడాది మే నెలలో తన కారును ఓవర్ టేక్ చేసినందుకు నడిరోడ్డుపై ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని రాఖీ యాదవ్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. అనంతరం పరారీలో ఉన్న అతడిని అదే నెల 11న పోలీసులు అరెస్ట్ చేయగా, పట్నా హైకోర్టు ఈ నెల 19న బెయిల్ మంజూరు చేసింది. కాగా రాఖీ యాదవ్‌కు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ బిహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. -
రాఖీ యాదవ్ మళ్లీ జైలుకు..
న్యూఢిల్లీ : జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాఖీ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. టీనేజ్ యువకుడి హత్య కేసులో రాఖీ యాదవ్‌కు పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. దీంతో అతడు తిరిగి జైలుకు వెళ్లనున్నాడు. కాగా రాఖీ యాదవ్ బెయిల్ మంజూరు కావడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న అక్కసుతో ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని రాఖీ యాదవ్ ఈ ఏడాది మే నెలలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. గత వారమే పట్నా హైకోర్టు రాఖీ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేయటంతో మృతుడి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. -
లొంగిపోయిన మహిళా ఎమ్మెల్సీ.. 14 రోజుల కస్టడీ
విదేశీ మద్యం అక్రమ నిల్వ కేసులో సస్పెండైన జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవి మంగళవారం తెల్లవారుజామున గయ కోర్టులో లొంగిపోయారు. ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే.. అసలు తన ఇంట్లో విదేశీ మద్యం ఏమీ దొరకలేదని, తనను రాజకీయంగా ఇరికించాలనే ఇలా చేశారని మనోరమాదేవి అన్నారు. తాను నిరపరాధినని కోర్టు వద్ద మీడియాతో చెప్పారు. ఆమె కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ గయ ప్రాంతంలో తన కారును ఓ యువకుడు ఓవర్టేక్ చేశాడన్న కోపంతో అతడిని కాల్చిచంపిన కేసులో నిందితుడు. ఈ కేసులో మనోరమాదేవిని ప్రశ్నించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా అక్కడ భారీ మొత్తంలో విదేశీ మద్యం సీసాలు లభించాయి. దాంతోపాటు, ఓ బాలకార్మికుడిని తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నట్లు కూడా ఆమెపై కేసు పెట్టారు. తన కొడుకు రాకీ యాదవ్‌ను పోలీసులకు దొరక్కుండా దాచిపెట్టినందుకు సైతం మరో కేసు నమోదైంది. దీంతో చాలా కాలంగా పరారీలో ఉన్న మనోరమాదేవి.. ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. -
ఎమ్మెల్సీ భర్త.. అప్పుడు సైకిళ్ల దొంగ!
రాకీ యాదవ్.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బిహార్‌లో ఎమ్మెల్సీ మనోరమా దేవి యాదవ్ కుమారుడు. తన కారును ఓవర్టేక్ చేశాడన్న కోపంతో ఇంటర్ విద్యార్థిని కాల్చిచంపిన కేసులో అతడు అరెస్టయ్యాడు. అతడి తండ్రి బిందేశ్వరీ ప్రసాద్ యాదవ్ అలియాస్ బిందీ యాదవ్. ప్రస్తుతం అతడు కూడా వేరే కేసులో జైల్లో ఉన్నాడు. ఇప్పుడంటే బిందీ యాదవ్ పెద్ద కోటీశ్వరుడు గానీ.. ఓ 35 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అతగాడు సైకిళ్ల దొంగ!! అవును.. అప్పట్లో అతడు సైకిళ్లు దొంగిలించేవాడని స్థానికులు చెప్పారు. అయితే, బాగా ఎదగాలన్న కోరిక మాత్రం అతడికి ఉండేది. దాంతో 1990లలో బచ్చూ అనే మరో నేరస్తుడితో చేతులు కలిపాడు. బిందియా - బచ్చు జోడీ నేర సామ్రాజ్యంలో బాగా పేరు పొందింది. గయ పట్టణంలో అనేక ఆస్తులు కబ్జా చేశారు. వాళ్ల తుపాకులు ఎప్పుడూ మోగుతూనే ఉండేవి. అందులోనూ లాలుప్రసాద్ సీఎంగా ఉన్న సమయంలో బిహార్‌లో నేరాలు విచ్చలవిడిగా సాగేవి. సురేంద్ర యాదవ్, రాజేంద్ర యాదవ్, మహేశ్వర యాదవ్ అనే కరడుగట్టిన నేరగాళ్లు తమ సత్తా చూపించేవాళ్లు. దాంతో బిందీ, బిచ్చు కూడా వాళ్లతో చేరిపోయారు. అయితే కొంతకాలం తర్వాత పోలీసులు వీళ్ల మీద గట్టి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టడంతో.. తనకు కూడా రాజకీయ అండదండలు అవసరమని బిందీ యాదవ్ గుర్తించాడు. 1990ల చివరి కాలంలో అతడు ఆర్జేడీలో చేరాడు. దాంతో నేరస్తుడు కాస్తా ఖద్దరు ధరించి, 2001లో గయ జిల్లాపరిషత్ చైర్మన్ అయ్యాడు. 2005లో ఇండిపెండెంట్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. మళ్లీ 2010లో ఆర్జేడీ టికెట్ మీద పోటీ చేసినా ఓడిపోయాడు. అప్పుడు అతడిపై 18 కేసులు ఉన్నట్లు అఫిడవిట్లోనే ఉం ది. 2010లో నితీష్ అధికారంలోకి రాగానే బిందీ పార్టీ మార్చేసి జేడీయూలో చేరాడు. 2011లో ఏకే-47, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ కలిగి ఉన్నందుకు అరెస్టయ్యాడు. ఆ తర్వాతి నుంచి రూటు మార్చి ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుని ఆస్తులు పెంచుకున్నాడు. ఇప్పుడు అతడికి అనేక మాల్స్, హోటళ్లు, 15 పెట్రోలు బంకులు.. ఇలా చాలా ఉన్నాయి. రోడ్డు నిర్మాణాలు, మద్యం వ్యాపారం.. ఇలా అతడు చేయని వ్యాపారమంటూ లేదు. అతడి కొడుకు రాకీ యాదవ్ వాడే ఎస్యూవీ ఖరీదు.. అక్షరాలా కోటిన్నర రూపాయలు!! ఇంత ఆస్తిపాస్తులున్నా, నేరుగా ఎన్నికల్లో గెలిచే అదృష్టం లేకపోవడంతో బిందీ యాదవ్ తన భార్య మనోరమాదేవిని శాసనమండలికి పంపగలిగాడు. పేరుకు ఆమె ఎమ్మెల్సీ అయినా.. ఆ అధికారం మొత్తం అతడి చేతుల్లోనే ఉంటుందన్నది కాదనలేని సత్యం. ఇప్పుడు బిహార్ సర్కారు ఈ కుటుంబంపై చర్యలు తీసుకుంటుందా లేక.. 'జంగిల్ రాజ్'ను మళ్లీ కొనసాగిస్తుందా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. -
'అతడికి తుపాకీ లైసెన్స్ ఇచ్చింది మేమే'
న్యూఢిల్లీ/పట్నా: హత్య కేసులో ఇరుకున్న జేడీ(యూ) మహిళ ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్ కు తుపాకీ లైసెన్స్ ఇచ్చింది తామేనని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. 2013లో అతడికి లైసెన్స్ మంజూరు చేసామని ఢిల్లీ పోలీసు విభాగం సమాచార అధికారి శుక్రవారం తెలిపారు. అతడిపై మోపిన అభియోగాలపై బిహార్ పోలీసుల నుంచి నివేదిక రాగానే రాకీ యాదవ్ తుపాకీ లైసెన్స్ ను రద్దు చేస్తామని చెప్పారు. తన కారును దాటి వెళ్లిపోయాడనే కోపంతో నడిరోడ్డుపై ఆదిత్య సచ్ దేవా అనే యువకుడిని కాల్చి చంపాడన్న ఆరోపణలతో రాకీ యాదవ్ ను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాకీ యాదవ్ తండ్రి బిండి యాదవ్, ఎమ్మెల్సీ మనోరమా బాడీగార్డ్ రాజేశ్ కుమార్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆదిత్య సచ్ దేవా కుటుంబానికి బిహార్ పోలీసులు భద్రత కల్పించారు. -
రాకీ యాదవ్ కు గన్లంటేనే పిచ్చి!
పాట్నా: తన కారును ఓవర్ టేక్ చేసినందుకు ఓ యువకుడిని కాల్చి చంపిన బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ గురించి ఆన్లైన్ లో తెగ వెతికేస్తున్నారు. అతడి అభిరుచులు గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు క్యూ కట్టారు. మే 7నుంచి ఇప్పటి వరకు బిహార్‌లో ఫేస్ బుక్ ద్వారా అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తి రంజన్ యాదవ్ అని.. మంగళవారం సాయంత్రం నాటికి ఫేస్ బుక్ ద్వారా అతడి గురించి 1,44,287సార్లు తెలుసుకునేందుకు క్లిక్ చేశారు. మే 7న రాత్రి రంజన్ యాదవ్ ఓ స్కూల్ యువకుడిని తన తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో నెటిజన్లంతా అతడి సమాచారం కోసం వివిధ పేర్లతో వెతకడం మొదలు పెట్టారు. రాకేశ్ రంజన్ యాదవ్ పేరిట 53,748మంది, రాకీ యాదవ్ పేరిట 69,789 మంది, రాకీ యాదవ్ గయా పేరిట 20,750 మంది అతడి గురించి తెలుసుకునేందుకు ఫేస్ బుక్ ద్వారా వెతికాడు. అయితే, అతడి ప్రొఫైల్ లో అతడి వివరాలేమి కనిపించలేదు. కానీ, కొన్ని ఫొటోల్లో మాత్రం కండల వీరుడిగా కనిపించాడు. ఈ తుపాకులతో పలుసార్లు పోజిచ్చి కనిపించాడు. దీని ప్రకారం అతడికి తుపాకులంటే చాలా ఇష్టమని తెలిసింది. -
కొడుకు అరెస్ట్, అమ్మ సస్పెన్షన్
పట్నా: మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవిపై జేడీ(యూ) సస్పెన్షన్ వేటు వేసింది. ఆమె కొడుకు రాకీ యాదవ్ హత్య కేసులో ఇరుక్కోవడంతో మనోరమపై ఈ చర్య తీసుకుంది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో 20 ఏళ్ల యువకుడిని తుపాకీతో కాల్చి చంపినట్టు రాకీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గయా జిల్లాలోని మస్తీపురా గ్రామంలో సోమవారం రాత్రి రాకీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి తుపాకీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని రాకీ అన్నాడు. హత్య జరిగినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నానని తెలిపాడు. -
ఆమె తన కొడుకును పోలీసులకు ఎలా పట్టించారంటే..
బిహార్ ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ పోలీసులకు పట్టుబడిన వ్యవహారం చాలా మలుపులు తిరిగింది. సాక్షాత్తు అతడి కన్నతల్లే అతడిని పోలీసులకు పట్టించారు. అయితే అది మాత్రం అంత సులభంగా ఏమీ జరగలేదు. మంగళవారం తెల్లవారుజామున బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాకీని పోలీసులు పట్టుకున్నారు. యాదవ్ అప్పటికి తన తండ్రి బిందీ యాదవ్ డెయిరీ ఫారంలో దాక్కున్నాడు. ఆదిత్య సచ్దేవ అనే ఇంటర్ కుర్రాడిని తన కారు ఓవర్ టేక్ చేసినందుకు కాల్చేసిన కేసులో రాకీ నిందితుడన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి సమయంలో గయ పోలీసు కమిషనర్ అవకాష్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం ఎమ్మెల్సీ ఇంట్లో సోదా చేసి, విదేశీ మద్యం బాటిళ్లు సహా అనేక అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వం తమకు స్వేచ్ఛ ఇచ్చిందని, రాకీని పట్టుకోకుండా ఉత్త చేతులతో వెళ్లేది లేదని వాళ్లు మనోరమాదేవికి స్పష్టం చేశారు. మొదట అతడు ఎక్కడున్నాడో తెలియదని చెప్పినా, తర్వాత పోలీసుల ఒత్తిడి తట్టుకోలేకపోయారు. నేరస్థుడి ఆచూకీ దాచడం కూడా నేరమే అవుతుందని చెప్పడంతో ఇక అతడి గురించి చెప్పక తప్పలేదు. ఆమె భర్త కూడా ఇప్పటికే వేరే ఆరోపణలపై జైల్లో ఉన్నారు. అత్యాచార ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్‌వల్లభ్ యాదవ్‌కు మనోరమ స్వయానా మరదలు. ఆ విషయాన్ని కూడా పోలీసులు చెప్పి, ఎంతటి వాళ్లయినా ఊచలు లెక్కపెట్టక తప్పదని బెదిరించారు. పోలీసుల ఒత్తిడి పనిచేసింది. ఎమ్మెల్సీ తన లాయర్లను కూడా సంప్రదించిన తర్వాత చివరకు రాకీ దాగున్న మస్తీపురాకు పోలీసులను తీసుకెళ్లారు. రాకీ వద్ద విదేశాల్లో తయారైన బెరెట్టా పిస్టల్, దాని మ్యాగజైన్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
జైలుకు పంపడం కాదు అతణ్ణి ఉరితీయాలి!
చేతికందివచ్చేందుకు సిద్ధంగా ఉన్న చెట్టంతా కొడుకు అకారణంగా ఒక దుర్మార్గానికి బలైతే.. ఆ తండ్రి వేదన ఎంత దీనంగా ఉంటుందో.. ఆదిత్య సచ్ దేవ్ తండ్రిని చూస్తే తెలుస్తుంది. ఎమ్మెల్సీ కొడుకు చేతిలో తన తనయుడు దారుణ హత్యకు గురయ్యాడన్న వార్త తెలిసి గుండె పగిలిన ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బంధువులు, కుటుంబసభ్యులు ఎంత ఓదార్చాలని ప్రయత్నిస్తున్నా.. ఆయన దుఃఖాన్ని ఆపడం వారి వశమవ్వడం లేదు. తన కొడుకును హత్య చేసిన ఎమెల్సీ కొడుకు రాకీకుమార్ యాదవ్ ను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. అతడిని అరెస్టు చేసి జైలుకు పంపితే.. కేవలం ఆరు నెలల్లోనే బయటకొస్తాడని అన్నారు. ఈ కేసులో వేగంగా దర్యాప్తు జరుపాలని, రాకీకుమార్ ను ఉరితీస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన పేర్కొన్నారు. తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడన్న కోపంతో జేడీయూ ఎమ్మెల్సీ మనోరమదేవి తనయుడు రాకీ యాదవ్ ఆదిత్య సచ్ దేవ్ ను కాల్చిచంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తాను ఆదిత్యను కాల్చలేదని, తనకు ఈ ఘటనతో ప్రమేయం లేదని నిందితుడు చెప్తున్నాడు. #WATCH: Victim Aditya's father mourns the demise of his son, who was allegedly shot dead by JDU MLC's son Rockyhttps://t.co/slitxs46n2 — ANI (@ANI_news) 10 May 2016 -
'కావాలనే ఇరికించారు, అప్పుడు ఢిల్లీలో ఉన్నా'
గయా: వాహనాన్ని ఓవర్ టేక్ చేసినందుకు యువకుడిని కాల్చి చంపిన వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు, ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకీ యాదవ్ వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలను అతడు కొట్టిపారేశాడు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని, అన్ని విషయాలు కోర్టులో వెల్లడిస్తానని రాకీ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఆ ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నట్లు అతడు తెలిపాడు. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న రాకీ యాదవ్‌ను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతడి వద్ద నుంచి గన్ను స్వాధీనం చేసుకుని, విచారణ జరుపుతున్నారు. కాగా ఆదిత్య సచ్ దేవా(25) అనే యువకుడు గయ సమీపంలో శనివారం రాకీ యాదవ్ వాహనాన్ని ఓవర్ టేక్ చేయడంతో ఆగ్రహించిన ఎమ్మెల్సీ కొడుకు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ అరెస్ట్
గయా: తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడని ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన జేడీయూ ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గయాలో మంగళవారం తెల్లవారుజామున అతడిని అదుపులోకి తీసుకున్నట్లు గయా సీనియర్ సూపరెండెంట్ ఆఫ్ కమిషనర్ గరిమా మాలిక్ ధ్రువీకరించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కాగా ఆదిత్య సచ్ దేవా(25) అనే యువకుడు గయ సమీపంలో జేడీయూ పార్టీ ఎమ్మెల్సీ మనోరమా దేవి యాదవ్ కొడుకు రాకీ యాదవ్ కారును ఓవర్ టేక్ చేస్తూ వెళ్లాడు. దాంతో ఆగ్రహం చెందిన అతడు తన వద్ద ఉన్న రైఫిల్ తో యువకుడిని కాల్చడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రాకీ యాదవ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితుడిని తప్పించారన్న ఆరోపణలతో రాకీ యాదవ్ తండ్రి బిండి యాదవ్, ఎమ్మెల్సీ మనోరమా బాడీగార్డ్ రాజేశ్ కుమార్ లకు కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. విచారణ నిమిత్తం గయా సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక రాకీ కారును అతని ఇంటివద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.