ఎమ్మెల్సీ భర్త.. అప్పుడు సైకిళ్ల దొంగ!
రాకీ యాదవ్.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బిహార్‌లో ఎమ్మెల్సీ మనోరమా దేవి యాదవ్ కుమారుడు. తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న కోపంతో ఇంటర్ విద్యార్థిని కాల్చిచంపిన కేసులో అతడు అరెస్టయ్యాడు. అతడి తండ్రి బిందేశ్వరీ ప్రసాద్ యాదవ్ అలియాస్ బిందీ యాదవ్. ప్రస్తుతం అతడు కూడా వేరే కేసులో జైల్లో ఉన్నాడు. ఇప్పుడంటే బిందీ యాదవ్ పెద్ద కోటీశ్వరుడు గానీ.. ఓ 35 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అతగాడు సైకిళ్ల దొంగ!! అవును.. అప్పట్లో అతడు సైకిళ్లు దొంగిలించేవాడని స్థానికులు చెప్పారు.
అయితే, బాగా ఎదగాలన్న కోరిక మాత్రం అతడికి ఉండేది. దాంతో 1990లలో బచ్చూ అనే మరో నేరస్తుడితో చేతులు కలిపాడు. బిందియా - బచ్చు జోడీ నేర సామ్రాజ్యంలో బాగా పేరు పొందింది. గయ పట్టణంలో అనేక ఆస్తులు కబ్జా చేశారు. వాళ్ల తుపాకులు ఎప్పుడూ మోగుతూనే ఉండేవి. అందులోనూ లాలుప్రసాద్ సీఎంగా ఉన్న సమయంలో బిహార్‌లో నేరాలు విచ్చలవిడిగా సాగేవి. సురేంద్ర యాదవ్, రాజేంద్ర యాదవ్, మహేశ్వర యాదవ్ అనే కరడుగట్టిన నేరగాళ్లు తమ సత్తా చూపించేవాళ్లు. దాంతో బిందీ, బిచ్చు కూడా వాళ్లతో చేరిపోయారు.
అయితే కొంతకాలం తర్వాత పోలీసులు వీళ్ల మీద గట్టి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టడంతో.. తనకు కూడా రాజకీయ అండదండలు అవసరమని బిందీ యాదవ్ గుర్తించాడు. 1990ల చివరి కాలంలో అతడు ఆర్జేడీలో చేరాడు. దాంతో నేరస్తుడు కాస్తా ఖద్దరు ధరించి, 2001లో గయ జిల్లాపరిషత్ చైర్మన్ అయ్యాడు. 2005లో ఇండిపెండెంట్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. మళ్లీ 2010లో ఆర్జేడీ టికెట్ మీద పోటీ చేసినా ఓడిపోయాడు. అప్పుడు అతడిపై 18 కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లోనే ఉం ది. 2010లో నితీష్ అధికారంలోకి రాగానే బిందీ పార్టీ మార్చేసి జేడీయూలో చేరాడు. 2011లో ఏకే-47, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ కలిగి ఉన్నందుకు అరెస్టయ్యాడు. ఆ తర్వాతి నుంచి రూటు మార్చి ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుని ఆస్తులు పెంచుకున్నాడు.
ఇప్పుడు అతడికి అనేక మాల్స్, హోటళ్లు, 15 పెట్రోలు బంకులు.. ఇలా చాలా ఉన్నాయి. రోడ్డు నిర్మాణాలు, మద్యం వ్యాపారం.. ఇలా అతడు చేయని వ్యాపారమంటూ లేదు. అతడి కొడుకు రాకీ యాదవ్ వాడే ఎస్‌యూవీ ఖరీదు.. అక్షరాలా కోటిన్నర రూపాయలు!! ఇంత ఆస్తిపాస్తులున్నా, నేరుగా ఎన్నికల్లో గెలిచే అదృష్టం లేకపోవడంతో బిందీ యాదవ్ తన భార్య మనోరమాదేవిని శాసనమండలికి పంపగలిగాడు. పేరుకు ఆమె ఎమ్మెల్సీ అయినా.. ఆ అధికారం మొత్తం అతడి చేతుల్లోనే ఉంటుందన్నది కాదనలేని సత్యం. ఇప్పుడు బిహార్ సర్కారు ఈ కుటుంబంపై చర్యలు తీసుకుంటుందా లేక.. 'జంగిల్ రాజ్'ను మళ్లీ కొనసాగిస్తుందా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న.