Bindi Yadav
-
రాఖీ యాదవ్‌కు యావజ్జీవం
పట్నా : జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాఖీ యాదవ్‌కు గయా కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న అక్కసుతో ఓ యువకుడిని కాల్చి చంపిన కేసులో రాఖీ యాదవ్‌తో పాటు మరో ఇద్దరికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన రాఖీయాదవ్ తండ్రి బింది యాదవ్‌కు ఐదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా గయాలో 2016, మే 7న తన వాహనాన్ని ఓవర్టేక్ చేసినందుకు ఇంటర్ విద్యార్థి ఆదిత్య సచ్దేవ్ను రాకీ యాదవ్ హత్య చేసినట్టు కోర్టు ఇప్పటికే నిర్థారించింది. ఇందుకు సంబంధించి రాఖీ యాదవ్‌కు ఇవాళ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. మరోవైపు న్యాయస్థానం తీర్పుపై మృతుడు ఆదిత్య సచ్దేవ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. గత 15 నెలలుగా ఈ కేసులో పలు మలుపులు చోటుచేసుకున్నాయి. రాఖీకి అప్పటి పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్బాల్ అహ్మద్ అన్సారీ గత అక్టోబర్‌లో బెయిల్ మంజూరు చేయగా, సుప్రీం కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులైన ఆదిత్య స్నేహితులు నలుగురు భిన్నంగా స్పందించడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు మధ్యలో మారిపోవడం వంటి అవరోధాలు ఎదురయ్యాయి. మరోవైపు రాఖీ తండ్రి బిందీ యాదవ్.. ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దింపడంతో ప్రాసిక్యూషన్ చివరికి శాస్త్రీయ ఆధారాలపైనే కేసులో నెగ్గుకొచ్చింది. -
ఎమ్మెల్సీ భర్త.. అప్పుడు సైకిళ్ల దొంగ!
రాకీ యాదవ్.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బిహార్‌లో ఎమ్మెల్సీ మనోరమా దేవి యాదవ్ కుమారుడు. తన కారును ఓవర్టేక్ చేశాడన్న కోపంతో ఇంటర్ విద్యార్థిని కాల్చిచంపిన కేసులో అతడు అరెస్టయ్యాడు. అతడి తండ్రి బిందేశ్వరీ ప్రసాద్ యాదవ్ అలియాస్ బిందీ యాదవ్. ప్రస్తుతం అతడు కూడా వేరే కేసులో జైల్లో ఉన్నాడు. ఇప్పుడంటే బిందీ యాదవ్ పెద్ద కోటీశ్వరుడు గానీ.. ఓ 35 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అతగాడు సైకిళ్ల దొంగ!! అవును.. అప్పట్లో అతడు సైకిళ్లు దొంగిలించేవాడని స్థానికులు చెప్పారు. అయితే, బాగా ఎదగాలన్న కోరిక మాత్రం అతడికి ఉండేది. దాంతో 1990లలో బచ్చూ అనే మరో నేరస్తుడితో చేతులు కలిపాడు. బిందియా - బచ్చు జోడీ నేర సామ్రాజ్యంలో బాగా పేరు పొందింది. గయ పట్టణంలో అనేక ఆస్తులు కబ్జా చేశారు. వాళ్ల తుపాకులు ఎప్పుడూ మోగుతూనే ఉండేవి. అందులోనూ లాలుప్రసాద్ సీఎంగా ఉన్న సమయంలో బిహార్‌లో నేరాలు విచ్చలవిడిగా సాగేవి. సురేంద్ర యాదవ్, రాజేంద్ర యాదవ్, మహేశ్వర యాదవ్ అనే కరడుగట్టిన నేరగాళ్లు తమ సత్తా చూపించేవాళ్లు. దాంతో బిందీ, బిచ్చు కూడా వాళ్లతో చేరిపోయారు. అయితే కొంతకాలం తర్వాత పోలీసులు వీళ్ల మీద గట్టి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టడంతో.. తనకు కూడా రాజకీయ అండదండలు అవసరమని బిందీ యాదవ్ గుర్తించాడు. 1990ల చివరి కాలంలో అతడు ఆర్జేడీలో చేరాడు. దాంతో నేరస్తుడు కాస్తా ఖద్దరు ధరించి, 2001లో గయ జిల్లాపరిషత్ చైర్మన్ అయ్యాడు. 2005లో ఇండిపెండెంట్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. మళ్లీ 2010లో ఆర్జేడీ టికెట్ మీద పోటీ చేసినా ఓడిపోయాడు. అప్పుడు అతడిపై 18 కేసులు ఉన్నట్లు అఫిడవిట్లోనే ఉం ది. 2010లో నితీష్ అధికారంలోకి రాగానే బిందీ పార్టీ మార్చేసి జేడీయూలో చేరాడు. 2011లో ఏకే-47, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ కలిగి ఉన్నందుకు అరెస్టయ్యాడు. ఆ తర్వాతి నుంచి రూటు మార్చి ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుని ఆస్తులు పెంచుకున్నాడు. ఇప్పుడు అతడికి అనేక మాల్స్, హోటళ్లు, 15 పెట్రోలు బంకులు.. ఇలా చాలా ఉన్నాయి. రోడ్డు నిర్మాణాలు, మద్యం వ్యాపారం.. ఇలా అతడు చేయని వ్యాపారమంటూ లేదు. అతడి కొడుకు రాకీ యాదవ్ వాడే ఎస్యూవీ ఖరీదు.. అక్షరాలా కోటిన్నర రూపాయలు!! ఇంత ఆస్తిపాస్తులున్నా, నేరుగా ఎన్నికల్లో గెలిచే అదృష్టం లేకపోవడంతో బిందీ యాదవ్ తన భార్య మనోరమాదేవిని శాసనమండలికి పంపగలిగాడు. పేరుకు ఆమె ఎమ్మెల్సీ అయినా.. ఆ అధికారం మొత్తం అతడి చేతుల్లోనే ఉంటుందన్నది కాదనలేని సత్యం. ఇప్పుడు బిహార్ సర్కారు ఈ కుటుంబంపై చర్యలు తీసుకుంటుందా లేక.. 'జంగిల్ రాజ్'ను మళ్లీ కొనసాగిస్తుందా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. -
'కావాలనే ఇరికించారు, అప్పుడు ఢిల్లీలో ఉన్నా'
గయా: వాహనాన్ని ఓవర్ టేక్ చేసినందుకు యువకుడిని కాల్చి చంపిన వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు, ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకీ యాదవ్ వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలను అతడు కొట్టిపారేశాడు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని, అన్ని విషయాలు కోర్టులో వెల్లడిస్తానని రాకీ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఆ ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నట్లు అతడు తెలిపాడు. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న రాకీ యాదవ్‌ను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతడి వద్ద నుంచి గన్ను స్వాధీనం చేసుకుని, విచారణ జరుపుతున్నారు. కాగా ఆదిత్య సచ్ దేవా(25) అనే యువకుడు గయ సమీపంలో శనివారం రాకీ యాదవ్ వాహనాన్ని ఓవర్ టేక్ చేయడంతో ఆగ్రహించిన ఎమ్మెల్సీ కొడుకు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ అరెస్ట్
గయా: తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడని ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన జేడీయూ ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గయాలో మంగళవారం తెల్లవారుజామున అతడిని అదుపులోకి తీసుకున్నట్లు గయా సీనియర్ సూపరెండెంట్ ఆఫ్ కమిషనర్ గరిమా మాలిక్ ధ్రువీకరించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కాగా ఆదిత్య సచ్ దేవా(25) అనే యువకుడు గయ సమీపంలో జేడీయూ పార్టీ ఎమ్మెల్సీ మనోరమా దేవి యాదవ్ కొడుకు రాకీ యాదవ్ కారును ఓవర్ టేక్ చేస్తూ వెళ్లాడు. దాంతో ఆగ్రహం చెందిన అతడు తన వద్ద ఉన్న రైఫిల్ తో యువకుడిని కాల్చడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రాకీ యాదవ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితుడిని తప్పించారన్న ఆరోపణలతో రాకీ యాదవ్ తండ్రి బిండి యాదవ్, ఎమ్మెల్సీ మనోరమా బాడీగార్డ్ రాజేశ్ కుమార్ లకు కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. విచారణ నిమిత్తం గయా సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక రాకీ కారును అతని ఇంటివద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఓవర్ టేక్ చేశాడని ఎమ్మెల్సీ కొడుకు చంపేశాడు!
గయ: బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ రాజకీయ నాయకుడి వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడని కారణంతో ఓ యువకుడిని కాల్చి చంపారు. గయ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదిత్య సచ్ దేవా(25) అనే యువకుడు గయ సమీపంలో జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బిండీ యాదవ్ కొడుకు కారును ఓవర్ టేక్ చేస్తూ వెళ్లాడు. దాంతో అతడు తన వద్ద ఉన్న రైఫిల్ తో కాల్చడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా దీనిపై బిండీయాదవ్ స్పందించారు. తొలుత ఆ యువకుడికి తన కుమారుడికి మధ్య గొడవ జరిగిందని, తనను తాను రక్షించుకునేందుకు తన కుమారుడు తుపాకీ బయటకు తీశాడని, పొరపాటున అది పేలి ఆ యువకుడు చనిపోయాడని చెప్పారు. మరో జేడీయూ నేత స్పందిస్తూ.. ఏ ఒక్కరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని అలా తీసుకుంటే శిక్ష పడుతుందని, అలాంటి రక్షించాలని చూడటం కూడా నేరమవుతుందని చెప్పారు.