ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ అరెస్ట్
గయా: తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడని ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన జేడీయూ ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గయాలో మంగళవారం తెల్లవారుజామున అతడిని అదుపులోకి తీసుకున్నట్లు గయా సీనియర్ సూపరెండెంట్ ఆఫ్ కమిషనర్ గరిమా మాలిక్ ధ్రువీకరించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
కాగా ఆదిత్య సచ్ దేవా(25) అనే యువకుడు గయ సమీపంలో జేడీయూ పార్టీ ఎమ్మెల్సీ మనోరమా దేవి యాదవ్ కొడుకు రాకీ యాదవ్ కారును ఓవర్ టేక్ చేస్తూ వెళ్లాడు. దాంతో ఆగ్రహం చెందిన అతడు తన వద్ద ఉన్న రైఫిల్ తో యువకుడిని కాల్చడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రాకీ యాదవ్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు నిందితుడిని తప్పించారన్న ఆరోపణలతో రాకీ యాదవ్ తండ్రి బిండి యాదవ్, ఎమ్మెల్సీ మనోరమా బాడీగార్డ్ రాజేశ్ కుమార్ లకు కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. విచారణ నిమిత్తం గయా సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక రాకీ కారును అతని ఇంటివద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.