'కావాలనే ఇరికించారు, అప్పుడు ఢిల్లీలో ఉన్నా'
గయా: వాహనాన్ని ఓవర్ టేక్ చేసినందుకు యువకుడిని కాల్చి చంపిన వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు, ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకీ యాదవ్ వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలను అతడు కొట్టిపారేశాడు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని, అన్ని విషయాలు కోర్టులో వెల్లడిస్తానని రాకీ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఆ ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నట్లు అతడు తెలిపాడు.
మరోవైపు అజ్ఞాతంలో ఉన్న రాకీ యాదవ్ను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతడి వద్ద నుంచి గన్ను స్వాధీనం చేసుకుని, విచారణ జరుపుతున్నారు. కాగా ఆదిత్య సచ్ దేవా(25) అనే యువకుడు గయ సమీపంలో శనివారం రాకీ యాదవ్ వాహనాన్ని ఓవర్ టేక్ చేయడంతో ఆగ్రహించిన ఎమ్మెల్సీ కొడుకు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.