పట్నా : జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాఖీ యాదవ్కు గయా కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న అక్కసుతో ఓ యువకుడిని కాల్చి చంపిన కేసులో రాఖీ యాదవ్‌తో పాటు మరో ఇద్దరికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన రాఖీయాదవ్ తండ్రి బింది యాదవ్‌కు ఐదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
కాగా గయాలో 2016, మే 7న తన వాహనాన్ని ఓవర్‌టేక్ చేసినందుకు ఇంటర్ విద్యార్థి ఆదిత్య సచ్‌దేవ్‌ను రాకీ యాదవ్ హత్య చేసినట్టు కోర్టు ఇప్పటికే నిర్థారించింది. ఇందుకు సంబంధించి రాఖీ యాదవ్‌కు ఇవాళ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. మరోవైపు న్యాయస్థానం తీర్పుపై మృతుడు ఆదిత్య సచ్‌దేవ్ తల్లిదండ్రులు హర్షం వ్యక‍్తం చేశారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
గత 15 నెలలుగా ఈ కేసులో పలు మలుపులు చోటుచేసుకున్నాయి. రాఖీకి అప్పటి పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్బాల్ అహ్మద్ అన్సారీ గత అక్టోబర్‌లో బెయిల్ మంజూరు చేయగా, సుప్రీం కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులైన ఆదిత్య స్నేహితులు నలుగురు భిన్నంగా స్పందించడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు మధ్యలో మారిపోవడం వంటి అవరోధాలు ఎదురయ్యాయి. మరోవైపు రాఖీ తండ్రి బిందీ యాదవ్.. ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దింపడంతో ప్రాసిక్యూషన్ చివరికి శాస్త్రీయ ఆధారాలపైనే కేసులో నెగ్గుకొచ్చింది.