కొడుకు అరెస్ట్, అమ్మ సస్పెన్షన్
పట్నా: మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవిపై జేడీ(యూ) సస్పెన్షన్ వేటు వేసింది. ఆమె కొడుకు రాకీ యాదవ్ హత్య కేసులో ఇరుక్కోవడంతో మనోరమపై ఈ చర్య తీసుకుంది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో 20 ఏళ్ల యువకుడిని తుపాకీతో కాల్చి చంపినట్టు రాకీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
గయా జిల్లాలోని మస్తీపురా గ్రామంలో సోమవారం రాత్రి రాకీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి తుపాకీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని రాకీ అన్నాడు. హత్య జరిగినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నానని తెలిపాడు.