Manorama Devi
-
లొంగిపోయిన మహిళా ఎమ్మెల్సీ.. 14 రోజుల కస్టడీ
విదేశీ మద్యం అక్రమ నిల్వ కేసులో సస్పెండైన జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవి మంగళవారం తెల్లవారుజామున గయ కోర్టులో లొంగిపోయారు. ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే.. అసలు తన ఇంట్లో విదేశీ మద్యం ఏమీ దొరకలేదని, తనను రాజకీయంగా ఇరికించాలనే ఇలా చేశారని మనోరమాదేవి అన్నారు. తాను నిరపరాధినని కోర్టు వద్ద మీడియాతో చెప్పారు. ఆమె కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ గయ ప్రాంతంలో తన కారును ఓ యువకుడు ఓవర్టేక్ చేశాడన్న కోపంతో అతడిని కాల్చిచంపిన కేసులో నిందితుడు. ఈ కేసులో మనోరమాదేవిని ప్రశ్నించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా అక్కడ భారీ మొత్తంలో విదేశీ మద్యం సీసాలు లభించాయి. దాంతోపాటు, ఓ బాలకార్మికుడిని తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నట్లు కూడా ఆమెపై కేసు పెట్టారు. తన కొడుకు రాకీ యాదవ్‌ను పోలీసులకు దొరక్కుండా దాచిపెట్టినందుకు సైతం మరో కేసు నమోదైంది. దీంతో చాలా కాలంగా పరారీలో ఉన్న మనోరమాదేవి.. ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. -
అజ్ఞాతంలోకి మనోరమా
పాట్నా: బీహార్‌లో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని జేడీయూ మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి అతిక్రమించారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మనోరమా దేవి యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ ... తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో 20 ఏళ్ల యువకుడిని శనివారం తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు మనోరమా దేవి నివాసంలో గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఆమె నివాసంలో మందు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యపాన నిషేధం అమలవుతున్న బిహార్‌లో అదీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మనోరమా నివాసంలో మద్యం దొరకడంతో... ఆమెను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆమె అరెస్ట్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా మనోరమా దేవిపై ఆరేళ్ల పాటు పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. -
కొడుకు అరెస్ట్, అమ్మ సస్పెన్షన్
పట్నా: మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవిపై జేడీ(యూ) సస్పెన్షన్ వేటు వేసింది. ఆమె కొడుకు రాకీ యాదవ్ హత్య కేసులో ఇరుక్కోవడంతో మనోరమపై ఈ చర్య తీసుకుంది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో 20 ఏళ్ల యువకుడిని తుపాకీతో కాల్చి చంపినట్టు రాకీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గయా జిల్లాలోని మస్తీపురా గ్రామంలో సోమవారం రాత్రి రాకీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి తుపాకీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని రాకీ అన్నాడు. హత్య జరిగినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నానని తెలిపాడు. -
ఆమె తన కొడుకును పోలీసులకు ఎలా పట్టించారంటే..
బిహార్ ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ పోలీసులకు పట్టుబడిన వ్యవహారం చాలా మలుపులు తిరిగింది. సాక్షాత్తు అతడి కన్నతల్లే అతడిని పోలీసులకు పట్టించారు. అయితే అది మాత్రం అంత సులభంగా ఏమీ జరగలేదు. మంగళవారం తెల్లవారుజామున బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాకీని పోలీసులు పట్టుకున్నారు. యాదవ్ అప్పటికి తన తండ్రి బిందీ యాదవ్ డెయిరీ ఫారంలో దాక్కున్నాడు. ఆదిత్య సచ్దేవ అనే ఇంటర్ కుర్రాడిని తన కారు ఓవర్ టేక్ చేసినందుకు కాల్చేసిన కేసులో రాకీ నిందితుడన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి సమయంలో గయ పోలీసు కమిషనర్ అవకాష్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం ఎమ్మెల్సీ ఇంట్లో సోదా చేసి, విదేశీ మద్యం బాటిళ్లు సహా అనేక అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వం తమకు స్వేచ్ఛ ఇచ్చిందని, రాకీని పట్టుకోకుండా ఉత్త చేతులతో వెళ్లేది లేదని వాళ్లు మనోరమాదేవికి స్పష్టం చేశారు. మొదట అతడు ఎక్కడున్నాడో తెలియదని చెప్పినా, తర్వాత పోలీసుల ఒత్తిడి తట్టుకోలేకపోయారు. నేరస్థుడి ఆచూకీ దాచడం కూడా నేరమే అవుతుందని చెప్పడంతో ఇక అతడి గురించి చెప్పక తప్పలేదు. ఆమె భర్త కూడా ఇప్పటికే వేరే ఆరోపణలపై జైల్లో ఉన్నారు. అత్యాచార ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్‌వల్లభ్ యాదవ్‌కు మనోరమ స్వయానా మరదలు. ఆ విషయాన్ని కూడా పోలీసులు చెప్పి, ఎంతటి వాళ్లయినా ఊచలు లెక్కపెట్టక తప్పదని బెదిరించారు. పోలీసుల ఒత్తిడి పనిచేసింది. ఎమ్మెల్సీ తన లాయర్లను కూడా సంప్రదించిన తర్వాత చివరకు రాకీ దాగున్న మస్తీపురాకు పోలీసులను తీసుకెళ్లారు. రాకీ వద్ద విదేశాల్లో తయారైన బెరెట్టా పిస్టల్, దాని మ్యాగజైన్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
'ఎవరినీ వదిలిపెట్టం'
పట్నా: చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ కుమార్ యాదవ్ నడిరోడ్డుపై హత్యకు పాల్పడిన ఉదంతంపై ఆయన స్పందించారు. ఈ ఘటనలో రాకీ కుమార్ బాడీగార్డును సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసినట్టు తెలిపారు. డిపార్ట్ మెంటల్ పరంగా ఇప్పటికే చర్య తీసుకున్నారని, అతడిపై క్రిమినల్ కేసు కూడా పెట్టనున్నారని చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని, దోషులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. తన కుమారుడు పోలీసుల ముందు లొంగిపోతాడని మనోరమా దేవి తెలిపారు. దోషిగా తేలితే అతడిపై చట్టంగా చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. కాగా, పరారీలో ఉన్న తన కుమారుడితో మాట్లాడలేదని రాకీ తండ్రి బిందీ యాదవ్ తెలిపారు. పోలీసులు తన ఫోన్ లాక్కున్నారని, తన కొడుకుతో ఎలా మాట్లాడగలనని ఆయన ప్రశ్నించారు.