ఆమె తన కొడుకును పోలీసులకు ఎలా పట్టించారంటే..
బిహార్ ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ పోలీసులకు పట్టుబడిన వ్యవహారం చాలా మలుపులు తిరిగింది. సాక్షాత్తు అతడి కన్నతల్లే అతడిని పోలీసులకు పట్టించారు. అయితే అది మాత్రం అంత సులభంగా ఏమీ జరగలేదు. మంగళవారం తెల్లవారుజామున బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాకీని పోలీసులు పట్టుకున్నారు. యాదవ్ అప్పటికి తన తండ్రి బిందీ యాదవ్ డెయిరీ ఫారంలో దాక్కున్నాడు. ఆదిత్య సచ్‌దేవ అనే ఇంటర్ కుర్రాడిని తన కారు ఓవర్ టేక్ చేసినందుకు కాల్చేసిన కేసులో రాకీ నిందితుడన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి సమయంలో గయ పోలీసు కమిషనర్ అవకాష్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం ఎమ్మెల్సీ ఇంట్లో సోదా చేసి, విదేశీ మద్యం బాటిళ్లు సహా అనేక అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వం తమకు స్వేచ్ఛ ఇచ్చిందని, రాకీని పట్టుకోకుండా ఉత్త చేతులతో వెళ్లేది లేదని వాళ్లు మనోరమాదేవికి స్పష్టం చేశారు.
మొదట అతడు ఎక్కడున్నాడో తెలియదని చెప్పినా, తర్వాత పోలీసుల ఒత్తిడి తట్టుకోలేకపోయారు. నేరస్థుడి ఆచూకీ దాచడం కూడా నేరమే అవుతుందని చెప్పడంతో ఇక అతడి గురించి చెప్పక తప్పలేదు. ఆమె భర్త కూడా ఇప్పటికే వేరే ఆరోపణలపై జైల్లో ఉన్నారు. అత్యాచార ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్‌వల్లభ్ యాదవ్‌కు మనోరమ స్వయానా మరదలు. ఆ విషయాన్ని కూడా పోలీసులు చెప్పి, ఎంతటి వాళ్లయినా ఊచలు లెక్కపెట్టక తప్పదని బెదిరించారు. పోలీసుల ఒత్తిడి పనిచేసింది. ఎమ్మెల్సీ తన లాయర్లను కూడా సంప్రదించిన తర్వాత చివరకు రాకీ దాగున్న మస్తీపురాకు పోలీసులను తీసుకెళ్లారు. రాకీ వద్ద విదేశాల్లో తయారైన బెరెట్టా పిస్టల్, దాని మ్యాగజైన్ ఉన్నాయని పోలీసులు తెలిపారు.