JDU MLC
-
హత్యకేసులో రాఖీ యాదవ్‌కు బెయిల్
పట్నా: టీనేజ్ యువకుడు హత్య కేసులో జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాకీ యాదవ్‌కు బెయిల్ లభించింది. పట్నా హైకోర్టు గురువారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న అక్కసుతో ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని రాకీ యాదవ్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. మరోవైపు రాకీ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేయటంపై మృతుడి తండ్రి శ్యాం సుందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బు, అధికారంతో మరిసారి వాస్తవాలు మరుగునపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ న్యాయం మాత్రం జరగలేదన్నారు. బిహార్‌కు ఇది చెడ్డరోజు అని శ్యాంసుందర్ అభివర్ణించారు. జంగిల్ రాజ్ నుంచి బిహార్ ను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
కొడుకు అరెస్ట్, అమ్మ సస్పెన్షన్
పట్నా: మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవిపై జేడీ(యూ) సస్పెన్షన్ వేటు వేసింది. ఆమె కొడుకు రాకీ యాదవ్ హత్య కేసులో ఇరుక్కోవడంతో మనోరమపై ఈ చర్య తీసుకుంది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో 20 ఏళ్ల యువకుడిని తుపాకీతో కాల్చి చంపినట్టు రాకీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గయా జిల్లాలోని మస్తీపురా గ్రామంలో సోమవారం రాత్రి రాకీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి తుపాకీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని రాకీ అన్నాడు. హత్య జరిగినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నానని తెలిపాడు. -
'ఎవరినీ వదిలిపెట్టం'
పట్నా: చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ కుమార్ యాదవ్ నడిరోడ్డుపై హత్యకు పాల్పడిన ఉదంతంపై ఆయన స్పందించారు. ఈ ఘటనలో రాకీ కుమార్ బాడీగార్డును సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసినట్టు తెలిపారు. డిపార్ట్ మెంటల్ పరంగా ఇప్పటికే చర్య తీసుకున్నారని, అతడిపై క్రిమినల్ కేసు కూడా పెట్టనున్నారని చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని, దోషులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. తన కుమారుడు పోలీసుల ముందు లొంగిపోతాడని మనోరమా దేవి తెలిపారు. దోషిగా తేలితే అతడిపై చట్టంగా చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. కాగా, పరారీలో ఉన్న తన కుమారుడితో మాట్లాడలేదని రాకీ తండ్రి బిందీ యాదవ్ తెలిపారు. పోలీసులు తన ఫోన్ లాక్కున్నారని, తన కొడుకుతో ఎలా మాట్లాడగలనని ఆయన ప్రశ్నించారు. -
ఓవర్టేక్ చేశాడని చంపేశాడు
బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ కొడుకు ఘాతుకం గయ: తన కారును ఓవర్టేక్ చేశాడనే కారణంతో బిహార్‌లో మహిళా ఎమ్మెల్సీ (జేడీయూ) కుమారుడు ఓ 20 ఏళ్ల యువకుడిని కాల్చి చంపాడు. ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ కుమార్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆదిత్య కుమార్ సచ్‌దేవా అనే యువకుడు గయ వద్ద శనివారం సాయంత్రం రాకీ కారును ఓవర్టేక్ చేశాడు. కోపోద్రిక్తుడైన రాకీ.. ఆదిత్యతో గొడవపడ్డాడని.. వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో యువకుడిపై కాల్పులు జరిపాడని కారులో ఆదిత్యతోపాటున్న స్నేహితులు తెలిపారు. రాకీ తండ్రి బిందీ యాదవ్‌ను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న రాకీ కోసం గాలిస్తున్నారు.