తెలంగాణకు అండగా ఉంటాం: మోడీ, సోనియా
తెలంగాణకు అండగా ఉంటాం: మోడీ, సోనియా
Published Tue, Jun 3 2014 1:03 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
29వ రాష్ట్రానికి స్వాగతం: ప్రధాని మోడీ
ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమానికి
కాంగ్రెస్ కట్టుబడి ఉంది: సోనియా
కేసీఆర్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్త రాష్ర్ట ఆవిర్భావాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. అభివృద్ధిలో తెలంగాణను కొత్త పుంతలు తొక్కించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీనిచ్చారు. తెలంగాణ ప్రజలకు, రాష్ర్ట తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశంలో కొత్త రాష్ట్రం అవతరించింది. 29వ రాష్ట్రంగా తెలంగాణను స్వాగతిస్తున్నాం. రానున్న సంవత్సరాల్లో మన ప్రగతి ప్రయాణానికి తెలంగాణ మరింత బలాన్నిస్తుంది. అనేక ఏళ్ల ఉద్యమాలు, అనేకమంది బలిదానాల వల్ల తెలంగాణ అవతరించింది. వారికి మా నివాళులు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలు చేరేందుకు తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు కేంద్రం పూర్తి అండగా ఉంటుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఇక తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. చివరకు తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని 2013లో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృత అభివృద్ధికి, పెట్టుబడి అవకాశాలకు ఈ పునర్వ్యవస్థీకరణ వీలు కల్పించేలా మా పార్టీ హామీనిచ్చింది. రెండు రాష్ట్రాల ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. రెండు రాష్ట్రాలు సామరస్యంతో పురోగమించడంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు.
సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వల్లే కొత్త రాష్ర్టం ఏర్పాటైందని మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉండాలని అభిలషించారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తమిళనాడు గవర్నర్ రోశయ్య అభినందనలు తెలిపారు.
డీఎంకే అధినేత కరుణానిధి కూడా కేసీఆర్‌ను అభినందించారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ.. 29వ రాష్ట్రానికి స్వాగతమంటూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. తెలంగాణ, సీమాంధ్రలకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. వెనుకబడిన రాష్ట్రాలకు చేయూతనివ్వడం ద్వారా దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఈ ప్రాంతంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న రాష్ర్టపతి పాలనను తొలగిస్తూ సోమవారం ఉదయమే రాష్ర్టపతి భవన్ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. అయితే సీమాంధ్రలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే వరకు రాష్ర్టపతి పాలన కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement