ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం..
జాతీయ స్థాయిలో బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొంటాం
నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్‌ల ప్రతిన
పది జన్మలైనా కలిసే ఉంటామన్న లాలూ
అన్ని వర్గాల మద్దతుతోనే ఈ విజయం
సానుకూల దృక్పథంతో బిహార్ అభివృద్ధికి కృషి చేస్తా: నితీశ్
విభజన శక్తులను బిహార్ ప్రజలు తరిమికొట్టారు
బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తా: లాలూ
పట్నా: బీజేపీకి సమర్థవంతమైన ప్రతిపక్షంగా, జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సిద్ధమవుతామని మహా కూటమి నేతలు నితీశ్ కుమార్(జేడీయూ), లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్జేడీ) స్పష్టం చేశారు. బిహార్లో ఘన విజయం ఖాయమని తేలడంతో వారిరువురు ఆదివారం సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంగా నితీశ్ కుమారే కొనసాగుతారని లాలూ ప్రసాద్ విస్పష్టంగా ప్రకటించారు. సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నాలను బిహార్ ప్రజలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని నితీశ్ పేర్కొన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన ప్రత్యామ్నాయం అవసరమని దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న అభిప్రాయాన్ని ఈ ఫలితాలు ప్రతిఫలించాయన్నారు. బీజేపీయేతర పార్టీలు ఇందుకు కలసిరావాలని పిలుపునిచ్చారు.
నరేంద్రమోదీ నేతృత్వంలోని మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, అందులో భాగంగా దేశమంతా పర్యటిస్తానని లాలూ ప్రసాద్ ప్రకటించారు. మతవాద శక్తులను తరిమికొట్టేందుకు రైతులు, కూలీలు, అణగారిన వర్గాలతో మమేకమవుతానన్నారు. ‘బీజేపీ చాలా తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది. ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. బిహార్ ప్రజలు చాలా పరిణతితో ఓట్లేశారు. దళితులు, మహిళలు, యువత, మైనారిటీలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల మద్దతు లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు మాకు అనుకూలంగా ఓటేశారు. వారికి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అని నితీశ్ హామీ ఇచ్చారు. తనకెవరిపైనా కక్ష లేదని, సానుకూల దృక్పథంతో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
ప్రధాని మోదీ సహా తనకందరూ శుభాకాంక్షలు తెలిపారని, బిహార్ అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని నితీశ్ పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలపై బిహార్ ఫలితాల ప్రభావం చాన్నాళ్ల పాటు ఉంటుందని లాలూ ప్రసాద్ విశ్లేషించారు. ‘ఇది ఏ ఒక్క పార్టీ విజయమో కాదు. ఇది మహా కూటమి సంయుక్తంగా సాధించిన విజయం. మా మధ్య విభేదాలు సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. అది విఫలయత్నమే అవుతుంది. కనీసం మరో పది జన్మల పాటు మేం కలిసే ఉంటాం’ అని తనదైన శైలిలో లాలూ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం, ఆరెస్సెస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే.ఈ లాంతరు(ఆర్జేడీ ఎన్నికల చిహ్నం)తో దేశమంతా తిరుగుతాను. వారణాసి(మోదీ నియోజకవర్గం) కూడా వెళ్తాన’న్నారు. మత సహనంపై మోదీకి అమెరికా అధ్యక్షుడు సలహా ఇవ్వడాన్ని లాలూ ప్రస్తావించారు.