వర్ష బీభత్సం
రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని చిందరవందర చేశాయి. అనేక చోట్ల చెట్లు కూలిపోయూయి. విద్యుత్ లైన్లు తెగిపోయూయి. రోడ్లు జలమయమయ్యూయి. రాకపోకలు స్తంభించిపోయూయి. లోతట్టు నివాసాల్లోకి వరదనీరు చేరింది. మరో రెండురోజులపాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రానికి అధిక లబ్ధిని చేకూర్చే ఈశాన్య రుతుపవనాలు ఈనెల 18న ప్రారంభమయ్యూయి. రుతుపవనాలు మూడురోజుల కిందట మరింత బలపడడంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రారంభమయ్యూయి. తిరునెల్వేలీ, కన్యాకుమారి తదితర దక్షిణ జిల్లాల్లోనూ, చెన్నై, కడలూరు వంటి సముద్రతీర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం అంతా వర్షం కురిసి సాయంత్రానికి సద్దుమణిగింది. అయితే సోమవారం తెల్లవారుజాము నుంచి జోరున వర్షం ప్రారంభమైంది.
రోడ్లన్నీ జలమైపోయాయి. వాహనాల్లోకి నీరు చేరిపోవడంతో నడిరోడ్డుపై పలు వాహనాలు ఆగిపోయాయి. నగరంలో ఒక భారీ కంటైనర్ టైర్లు గుంతలో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పేదలు నివసించే లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి ప్రవహించడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యూరు. చెన్నైలో మూడురోజుల్లో 72 వృక్షాలు కూలిపోయాయి. ట్రిప్లికేన్‌లో ఒక ఇంటిపై భారీవృక్షం కూలిపోయింది. రోడ్లపై నిలిచిపోయిన నీటిని, కూలిపోయిన వృక్షాలను తొలగించేందుకు 2,978 మంది కార్పొరేషన్ కార్మికులు శ్రమిస్తున్నారు. ఉరకలేస్తున్న వరద నీటి ప్రవాహంతో కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్‌లోని వీరాణం చెరువు నిండిపోయింది. చెరువు మొత్తం సామర్థ్యం 47.05 అడుగులు కాగా సోమవారం ఉదయానికి 46 అడుగులకు చేరింది. వందలాది ఎకరాల్లో పంటనష్టం ఏర్పడింది.
అధికారుల నిర్లక్ష్యం: ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. రాష్ట్రం లోని 7 జిల్లాల అధికారులు ముందుగానే సెలవు ప్రకటించి జాగ్రత్తపడగా, చెన్నై, తూత్తుకూడి, కాంచీపురం, తిరువళ్లూరు తదితర జిల్లాల అధికారులు ఏ విషయం ప్రకటించలేదు. దీంతో విద్యాసంస్థలన్నీ యథావిధిగా పనిచేశాయి. విద్యార్థు లు సైతం వర్షంలోనే తడుస్తూ చేరుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల కోసం నేరుగా సంప్రదించాల్సిన అధికారులు టీవీల ముందు ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఉదయం 9 గంటల సమయంలో సెలవు ప్రకటించడంతో అప్పటికే విద్యాసంస్థలకు చేరుకున్న వారంతా మళ్లీ తడుస్తూ ఇళ్లకు చేరుకున్నారు.
మరో రెండురోజులు వర్షాలు: బంగాళాఖాతంలో నైరుతి దిశగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా మరో రెండు రోజుల పాటూ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణశాఖ అధికారి రమణ చెప్పా రు. సోమవారం ఉదయం 8.30 గంటలకు నమోదుచేసిన వివరాల ప్రకారం, శ్రీలంక- తమిళనాడు సముద్రతీర ప్రాంతాల నడుమ ఉన్న అల్పపీడనం పడమర దిశగా పయనించే అవకాశం ఉన్నందున మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలు ఉండేదీ లేనిదీ సోమవారం రాత్రి వరకు ప్రకటించలేదు.