సాక్షి, న్యూఢిల్లీ : అగ్నికి ఆజ్యం పోయడం అంటే ఇదే మరి! పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు గత నాలుగు రోజులుగా సమ్మె చేయడానికి కారణం ముస్లింలని, వారు దాడి చేయడం వల్ల నీల్ రతన్ సర్కార్ ఆస్పటల్ డాక్టర్ పరిబా ముఖోపాధ్యాయ్ కోమాలోకి వెళ్లారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. డాక్టర్ ముఖోపాధ్యాయ్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా సేథ్ సుఖ్‌లాల్ కర్నాని మెమోరియల్ ఆస్పత్రిలో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందక పలువురు రోగులు మరణిస్తున్నారు.
నీల్ రతన్ సర్కార్ ఆస్పత్రిలో మంగళవారం నాడు ఓ 75 ఏళ్ల వృద్ధుడు మరణించడంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆయన మరణించారని ఆరోపిస్తూ ఆయన బంధువులు ఇద్దరు జూనియర్ డాక్టర్లు, అక్కడి సిబ్బందిపై దాడి చేశారు. ఒక రోజు ఆ ఆస్పత్రికే పరిమితమైన జూనియర్ డాక్టర్ల సమ్మె రాజకీయం వల్ల రాష్ట్రమంతటా వ్యాపించి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. సమస్యను పరిష్కరించడంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెన ర్జీ అనసరించిన వైశరే ఈ పరిస్థితికి కారణం. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇలాంటిదే మరి. ముస్లిం వర్గానికి చెందిన వారు దాడిచేశారంటూ రాష్ట్ర బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ వ్యాఖ్యానించడం ద్వారా ఈ అంశాన్ని మొదట రాజకీయం చేశారు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని, నాలుగు గంటల్లో సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు తీసుకుంటానంటూ మమతా బెనర్జీ హెచ్చరించి డాక్టర్లను రెచ్చగొట్టారు. బీజేపీ మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ముస్లింలకు, ఇతర రోగులకు చికిత్స చేయవద్దు, ఒక్క బీజేపీకి చెందిన రోగులకే వైద్యం చేయాలన్నది వారి అభిమతం అంటూ మమతా బెనర్జీ కూడా రాజకీయ రంగు పులుముతున్నారు.
విధి నిర్వహణలో డాక్టర్లకు భద్రత కల్పించే విషయమై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా డాక్టర్లు సోమవారం నాడు సమ్మె చేయాలంటూ ‘ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ పిలుపునిచ్చే స్థాయికి పరిస్థితిని తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment