
మమతా బెనర్జీ (ఫైల్)
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శకటం కనిపించబోదు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంబంధించి బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన శకటాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. దీంతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మరోసారి తెరపైకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంబంధించి అన్ని రాష్ట్రాలు తమ శకట ప్రతిపాదనలను నిపుణుల కమిటీకి పంపిస్తాయి. శకటాల నేపథ్యం, ఇతివృత్తం, రూపకల్పన (డిజైన్), వీక్షకులపై పడే ప్రభావం తదితర అంశాల ఆధారంగా పరేడ్‌లో పాల్గొనేబోయే శకటాలను ఎంపిక చేస్తారు.
ఈసారి బెంగాల్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను నిపుణుల కమిటీ పరిశీలించింది. దీనిపై చర్చల అనంతరం బెంగాల్ శకటానికి రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తోంది. రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఈసారి 56 శకటాల ప్రతిపాదనలు రాగా.. అందులో 22 మాత్రమే ఎంపిక అయ్యాయి. ఎంపికైన శకటాలలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి కాగా, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందినది. తెలుగు రాష్ట్రాలతోపాటు అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ శకటాలను కేంద్రం ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment