ఆ 20వేల కోట్లు ఏం చేశారు?
కార్మిక సంక్షేమ నిధుల వినియోగంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: ‘కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన రూ. 20 వేల కోట్లు ఏం చేశారు? సెలవుపై వెళ్లిన అధికారుల టీ పార్టీలకు, విందు వినోదాలకు ఖర్చు చేశారా? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు కూడా ఈ డబ్బులేమయ్యాయో తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది’ అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి వసూలు చేసిన పన్నును సరిగా ఉపయోగించలేదని ‘నేషనల్ క్యాంపెయిన్ ఫర్ సెంట్రల్ లెజిస్లేషన్ ఆన్ కన్‌స్ట్రక్షన్ లేబర్’ అనే ఎన్‌జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ భారీ మొత్తం ఏమైపోయిందో కనుగొనాలని కాగ్‌ను ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు వచ్చిన మొత్తం ఎంతో కాగ్ కార్యాలయానికి తెలపాలని సూచించింది.