
సాక్షి, మైసూర్ : ప్రధాని తలుచుకుంటే తాను కోరుకున్న చోట ఉండవచ్చని అనుకుంటే పొరపాటే. ఈనెల 19,20 తేదీల్లో మైసూర్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన భద్రతా సిబ్బంది బస కోసం అధికారులు ఓ హోటల్‌ను సంప్రదించగా వసతిని కల్పించేందుకు సదరు హోటల్ నిరాకరించింది. ఓ వివాహ రిసెప్షన్ కోసం రూములన్నీ బుక్ అయ్యాయని, ప్రధానికి వసతి కల్పించలేమని హోటల్ లలితా మహల్ ప్యాలెస్ అధికారులకు తేల్చిచెప్పింది. ప్రధాని, ఆయన సిబ్బంది వసతి కోసం డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి ఓ అధికారి తమను సంప్రదించారని..అయితే ఓ వివాహ వేడుక కోసం రూమ్స్ అన్నీ బుక్ అవడంతో తాము ప్రధాని బృందానికి ఆశ్రయం కల్పించలేకపోయామని హోటల్ జనరల్ మేనేజర్ జోసెఫ్ మతియాస్ చెప్పారు.
ప్రధాని పర్యటన సమయంలోనే ఆదివారం సాయంత్రం నుంచి వివాహ రిసెప్షన్ ప్రారంభమైందని తెలిపారు. హోటల్‌లో కేవలం మూడు రూములే ఖాళీగా ఉన్నాయని..అయితే భద్రతా కారణాల రీత్యా ప్రధాని ఆయన భద్రతా సిబ్బందితో కూడిన భారీ బృందానికి అవి ఏమాత్రం సరిపోవని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ప్రధానితో పాటు భద్రతా సిబ్బందికి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం నగరంలోని హోటల్ రాడిసన్ బ్లూలో అధికారులు వసతి ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి మైసూర్ చేరుకున్న ప్రధాని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం మైసూర్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment