కోర్టులో లాయర్ల వీరంగం | When lawyers turned vandals | Sakshi
Sakshi News home page

కోర్టులో లాయర్ల వీరంగం

Published Tue, Feb 16 2016 12:46 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

కోర్టులో లాయర్ల వీరంగం - Sakshi

కోర్టులో లాయర్ల వీరంగం

జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు,జర్నలిస్టులపై దాడులు, దుర్భాషలు
♦ దాడుల్లో స్వయంగా పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే
♦ పలువురు జర్నలిస్టులు, టీచర్లకు గాయాలు
♦ విద్యార్థి నేతపై రాజద్రోహం కేసు విచారణ సందర్భంగా ఘటన
♦ జేఎన్‌యూలో విద్యార్థుల స్ట్రైక్
 
 న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదం మరింత తీవ్రమవుతోంది. అఫ్జల్ గురు ఉరిశిక్షకు వ్యతిరేకంగా వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంబంధించి జేఎన్‌యూ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై పెట్టిన రాజద్రోహం కేసు విచారణ సందర్భంగా సోమవారం పటియాలా కోర్టులో ఘర్షణ, దాడులు చోటు చేసుకున్నాయి. దేశభక్తులమని చెప్పుకుంటూ కొందరు న్యాయవాదులు కోర్టు లోపల, వెలపల జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులపై దాడులకు తెగబడ్డారు. మొదట కోర్టుహాల్లో జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు లక్ష్యంగా దాడి చేశారు.

‘దేశ వ్యతిరేకులను ఉత్పత్తి చేస్తున్న జేఎన్‌యూని మూసేయాలి. లాంగ్‌లివ్ ఇండియా’ అంటూ నినాదాలిచ్చారు. అక్కడే ఉన్న జర్నలిస్ట్‌లపైనా భౌతిక దాడికి పాల్పడ్డారు. తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నారంటూ.. ఎముకలు విరుగుతాయని తీవ్ర పదజాలంతో వారిని హెచ్చరించారు. కోర్టుహాల్ నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులను బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నించారు. మహిళలను నెట్టేశారు. అడ్డుకున్నవారిపై దాడికి దిగారు. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. కోర్టు హాలు వెలుపల మరో బృందం లాయర్లు విద్యార్థులు, జర్నలిస్టులపై దాడికి దిగారు.

ఈ దాడుల్లో 9మంది జర్నలిస్టులకు గాయాలైనట్లుగా తుగ్లక్‌రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 10 మంది సహోద్యోగులకు గాయాలైనట్లుగా జేఎన్‌యూ ఉపాధ్యాయులు తెలిపారు. ‘జేఎన్‌యూ టీచర్లు కూడా దేశద్రోహులే’ అంటూ తమపై దాడి చేశారని రోహిత్ ఆజాద్ అనే టీచర్ పేర్కొన్నారు. ‘లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు కోర్టుహాల్లోకి రాగానే మొదట మమ్మల్ని తిట్టడం ప్రారంభించారు. ఆ తరువాత అకస్మాత్తుగా మమ్మల్ని బయటకు నెట్టేస్తూ, కొట్టసాగారు’ అని ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ తెలిపారు. కోర్టుహాల్లో భారీ సంఖ్యలో పోలీసులున్నప్పటికీ.. వారిని అడ్డుకోలేదన్నారు. వేరేపనిపై కోర్టుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ కూడా దాడుల్లో పాలు పంచుకున్నారు. సీపీఐ కార్యకర్త అమీఖ్ జమాయ్‌పై చేయి చేసుకున్నారు. అనంతరం వేరే కోర్టుహాళ్లో జరిగిన విచారణలో కన్హయ్యకుమార్ కస్టడీని మరో రెండు రోజుల పాటు కోర్టు పొడిగించింది.

 లష్కరేతో సంబంధం లేదు
 కాగా, జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద కార్యక్రమానికి ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం ఉన్నట్లుగా తమ విచారణలో తేలలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. అయితే, ఆ కార్యక్రమంలో కన్హయ్య కుమార్ పాల్గొని, అభ్యంతరకర రీతిలో ప్రసంగించారని, అలాగే, దేశ వ్యతిరేక నినాదాలు చేశాడని పేర్కొన్నారు. రాజద్రోహం కేసులో ఆయనను అరెస్ట్ చేయడం సరైనదేనన్నారు. పటియాలా కోర్టులో జరిగింది చిన్నపాటి ఘర్షణ అని బస్సీ వ్యాఖ్యానించారు. ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం బస్సీ మీడియాకు ఈ వివరాలు తెలిపారు. కన్హయ్యపై రాజద్రోహం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

 రాహుల్ వర్సెస్ షా
 దేశ వ్యతిరేక నినాదాలు చేసిన దేశద్రోహులను సమర్ధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌పై బీజేపీ అధ్యక్షుడు అమిత్ ధ్వజమెత్తారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే.. దేశ విభజనను సమర్ధించడమని కాంగ్రెస్ భావిస్తోందా? అని సోనియాని ప్రశ్నించారు. ‘పాకిస్తాన్ జిందాబాద్.. గో ఇండియా గో బ్యాక్ అనే నినాదాలు, అఫ్జల్ గురును, కశ్మీర్ స్వాతంత్య్రాన్ని, కశ్మీర్లో వేర్పాటువాదాన్ని సమర్ధిస్తూ ఇచ్చిన నినాదాలను సమర్ధించడం చూస్తోంటే కాంగ్రెస్ నేత కశ్మీర్ వేర్పాటువాదులతో చేరిపోయారా అన్న అనుమానం కలుగుతోంద’ని వ్యాఖ్యానించారు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురును సమర్థిస్తూ.. ఆ దాడిలో అమరులైన వారి కుటుంబాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. షా వ్యాఖ్యలను రాహుల్ తిప్పికొడుతూ.. విభజన, విద్వేష ఎజెండాను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రోత్సహిస్తున్నాయని అస్సాంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. అందరి ఆలోచనలను నియంత్రించాలని, వారి అభిప్రాయాలను అందరిపై రుద్దాలని చూస్తోందన్నారు. దేశ సాంస్కృతిక వైవిధ్యంపై బీజేపీకి గౌరవం లేదన్నారు. బీజేపీకి ప్రతీ వర్సిటీలో ఉగ్రవాదులే కనిపిస్తున్నారంటూ మండిపడ్డారు.  

 అది నకిలీ ట్వీట్: జేఎన్‌యూలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తన మద్దతుందంటూ  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను లష్కరే వ్యవస్థాపకుడు, జేయూడీ చీఫ్ హఫీజ్  సయీద్ తోసిపుచ్చారు. ‘నా పేరుతో వచ్చిన ఒక నకిలీ ట్వీట్‌ను విశ్వసిస్తూ భారత హోంమంత్రి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం’ అని యూట్యూబ్‌లో ఒక వీడియో సందేశాన్ని సయీద్ పోస్ట్ చేశారు. వివాదానికి రాజ్‌నాథ్ మతం రంగు పులుముతున్నారని కాంగ్రెస్ నేత మనీశ్ తివారి విమర్శించారు.
 
 వర్సిటీలో స్ట్రైక్
 కన్హయ్య విడుదలయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. సోమవారం తరగతులను బహిష్కరించారు. వీరి ఆందోళనలకు సంఘీభావం ప్రకటించిన ఉపాధ్యాయులు మంగళవారం నుంచి సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మెలు, ఆందోళనలతో వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయొద్దని వీసీ జగదీశ్  విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన 8 మంది విద్యార్థుల వివరాలతో కూడిన స్థాయీ నివేదికను యూనివర్సిటీ కేంద్ర మానవ వనరుల శాఖకు పంపించింది. ఆ 8 మంది జాబితాలో కన్హయ్య పేరు ఉందా? లేదా? అనేది తెలియలేదు.
 
 ఏచూరికి బెదిరింపు కాల్స్
  కన్హయ్య అరెస్టును నిరసిస్తున్న  విద్యార్థులకు మద్దతిచ్చినందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం రాత్రి ఆమ్ ఆద్మీ బాలవీర్ సేన వారిగా చెప్పుకున్న వ్యక్తులు  మూడు సార్లు ఫోన్స్ చేసి ఏచూరిని అంతు చూస్తామన్నారని పేర్కొన్నాయి. ఆదివారం సీపీఎం కార్యాలయంపై దాడిచేసింది బలవీర్ సేనే కావొచ్చన్నాయి. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు జరుపుతున్నామని న్యూఢిల్లీ డీసీపీ తెలిపారు. వామపక్షాలను జాతివ్యతిరేకులుగా బీజేపీ పేర్కొనడంపై ఏచూరి మండిపడ్డారు.

 పోలీసుల అదుపులో గిలానీ
 ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఘటనకు సంబంధించి రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అధ్యాపకుడు ఎస్‌ఏఆర్ గిలానీని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు.
 
 వెలుగులోకి మరో వీడియో
 న్యూఢిల్లీ: అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 9న జేఎన్‌యూ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కార్యక్రమంలో పాల్గొన్న ఒక బృందంలోని కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్న దృశ్యం ఆ వీడియోలో ఉంది.  ఆ బృందంలో కన్హయ్య కుమార్ కూడా ఉన్నట్లు అందులో ఉంది. అయితే, ఈ వీడియోలో ఆయన నినాదాలు చేస్తున్నట్లు ఎక్కడా లేదు. అలాగే, కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కొందరు విద్యార్థుల ఐడీ కార్డులను పోలీసులు పరిశీలిస్తున్న మరో దృశ్యంలోనూ కన్హయ్యకుమార్ ఉన్నారు. ముఖానికి అడ్డుగా సగం వరకు రుమాలు కట్టుకున్న ఒక వ్యక్తి ఆజాద్ కశ్మీర్ నినాదాలు చేస్తున్నట్లుగా అందులో కనిపిస్తోంది. ఆ వ్యక్తి ఎవరో ఇంతవరకు గుర్తించలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement