
సాక్షి, బెంగళూరు : చెప్పులు పోవడం సహజం. తారుమారుకావడమనేది ఇందుకు ఒక కారణంకాగా.. కావాలని ఎత్తుకొనిపోయేవారు కొంతమంది. ఇలాంటి సహజంగా రద్దీ ప్రదేశాలైన ఆలయాలు, సమావేశాలు, సందర్శన ప్రాంతాల్లో చోటుచేసుకుంటుంటాయి. ఇండియాలో ఇవి సహజం అని అనడం కూడా పరిపాటి. అయితే, ఇలాంటి సంఘటనకు ఆఖరికి ఉపరాష్ట్రపతి కూడా బాధితుడిగా మిగిలారు. అవును.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పులు పోయాయి.
నిన్న (శుక్రవారం) బెంగళూరు పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అల్పాహారం నిమిత్తం నగర బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఇంటికి వచ్చారు. అల్పాహారం ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఆయన చెప్పులు కనిపించలేదు. అటుఇటూ చూశారు. వెంకయ్య భద్రతా సిబ్బంది కూడా ఇల్లు పరిసరాలు కలియతిరిగి వెతికారు కానీ చెప్పుల జాడను కనుగొనలేకపోయారు. అయితే చివరకు తమ చెప్పులు అనుకుని ఎవరో వేసుకుని వెళ్లి ఉంటారని సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత పీసీ మోహన్ విలేకరులతో మాట్లాడుతూ సమీపంలోని బాటా స్టోర్ నుంచి ఉపరాష్ట్రపతికి కొత్త చెప్పులు తెప్పించామని తెలిపారు. వెంకయ్య చెప్పులను ఎవరైనా దొంగతనం చేశారా లేక పొరపాటున వేసుకెళ్లారా అనేది మిస్టరీగా మారింది.