'జీఎస్టీ నష్టాలను ఎవరు భరించాలి'
న్యూఢిల్లీ: అనేక ప్రయోజనాలు ఉన్న జీఎస్టీ బిల్లును తేవడం ప్రశంసనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం జీఎస్టీ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదేళ్ల వరకు కేంద్రం భర్తీ చేస్తుందని చెప్పారని, అయితే ఐదేళ్ల తరువాత నష్టాలు కొనసాగితే ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు.
కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. వస్తువుల వర్గీకరణ, కేంద్ర, రాష్ట్ర వాటా, రూ. 1.5 కోట్ల లోపు, పైబడి టర్నోవర్ ఉన్న సంస్థలపై అజమాయిషీ తదితర అంశాలను బిల్లులో చేర్చాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాల నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్రం వివిధ వస్తువులపై సెస్ వేసి నిధిని తయారు చేయాలనుకుంటోందని, అయితే అది కేవలం స్వల్ప మొత్తమే అవుతుందని పేర్కొన్నారు. అలాంటప్పుడు నష్టాలను ఎక్కడి నుంచి భర్తీచేస్తారని ప్రశ్నించారు. లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై సెస్ విధించాలనుకోవడంలో తప్పులేదని, అయితే ఆల్కహాలేతర శీతలపానీయాలపై కూడా సెస్ విధించాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామీణులు సైతం వీటిని విరివిగా వినియోగిస్తున్న సంగతిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. 12 నాటికల్ మైళ్ల మేర సముద్ర ప్రాదేశిక జలాల పరిధిని రాష్ట్రాల పరిధిలోకి తేవడం వల్ల ఆ సరిహద్దును పంచుకునే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు రాకుండా చూడాలని కోరారు.
చిన్న చిన్న రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై అదనపు సెస్ విధించడం మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమే అవుతుందని, ఈ విషయాన్ని మరొకసారి పరిశీలించాలని కోరారు. జులై 1 నుంచి జీఎస్టీ అమలును లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇందుకు పరిశ్రమలు, అధికార యంత్రాంగం సంసిద్ధులై ఉండడం కష్టసాధ్యమైనందున ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలని కోరారు.