విశాల్ను ఒబామా వద్దకు తీసుకొచ్చిందెవరు?
ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)లో గతంలో ప్రాంతీయ డైరెక్టర్గా పనిచేసిన కేకే మహ్మద్కు జనవరి 19న అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఓ ఫోన్ వచ్చింది. ఏకంగా ఎంబసీ నుంచి ఫోన్ అనగానే ఆయన కాసేపు భయపడ్డారు. తర్వాత అవతల ఫోన్ చేసినవాళ్లు.. విశాల్ అనే కుర్రాడి చిరునామా ఇవ్వగలరా అని అడిగారు. భారతదేశ పర్యటనకు వస్తున్న ఒబామా దంపతులు ఆ పిల్లాడిని కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇంతకీ విశాల్ ఎవరో గుర్తుపట్టారా? ఇంతకుముందు 2010 నవంబర్ నెలలో ఒబామా దంపతులు భారతదేశానికి వచ్చినప్పుడు హుమాయూన్ సమాధి వద్ద విశాల్ను మరికొందరు పిల్లలతో కలిసి చూశారు. అప్పట్లో కేకే మహ్మద్ ఏఎస్ఐలో సూపరెంటిండింగ్ ఆర్కియాలజిస్టుగా ఉండేవారు. అక్కడ పనిచేసే కూలీల పిల్లల్లో ఒకరే.. విశాల్.
యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చే ఈ కార్మికులు.. తమ పిల్లలను కూడా వెంట తెచ్చుకునేవారు. అప్పట్లో విశాల్ సహా మొత్తం 500 మంది పిల్లలకు మహ్మద్, ఇతరులు పాఠాలు చెప్పేవారు.
అయితే, అమెరికన్ ఎంబసీ నుంచి ఫోన్ రాగానే, అసలు విశాల్ ఎక్కడున్నాడో.. వాళ్ల తల్లిదండ్రులు ఎక్కడున్నారో గుర్తించడం ఎలాగని మహ్మద్ కాసేపు ఆందోళన చెందారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడి ఆచూకీ కావాలని అవతలి వ్యక్తి ఫోన్లో చెప్పారు. 'విశాల్ను నేను మర్చిపోయా గానీ, ఒబామాలు మర్చిపోలేదు' అని మహ్మద్ అన్నారు. ఎట్టకేలకు యూపీలోని ఝాన్సీ సమీపంలో గల గ్రామంలో విశాల్ కుటుంబం ఆచూకీ దొరికింది. అతడి తల్లి, తండ్రి, సోదరి అంతా కూడా ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా దంపతులను కలిశారు. బరాక్ ఒబామా తన ప్రసంగంలో కూడా విశాల్ పేరును, అతడి గాధను ప్రస్తావించారు.