పన్నీరా... పళనినా!
⇒ న్యాయ నిపుణులతో సంప్రదింపులు
⇒ గవర్నర్‌తో పళనిస్వామి భేటీ
సాక్షి, చెన్నై: బలనిరూపణకు లేదా ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఎవర్ని ఆహ్వానిస్తారోనన్న ఉత్కంఠ తమిళనాట బయలుదేరింది. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంను ఆహ్వానిస్తారా? అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కె.పళనిస్వామిని ఆహ్వానిస్తారా? అన్న విషయమై విస్తృతచర్చ జరుగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం తనకు వ్యతిరేక తీర్పు వెలువడడంతో శశికళ... అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎంపిక చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సాయంత్రం ఐదు గంటలకు 13 మంది మంత్రులతో కలసి పళనిస్వామి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 5:30 గంటలనుంచి 15 నిమిషాలపాటు గవర్నర్‌తో భేటీ జరిగింది.
తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పెట్టిన సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు పళనిస్వామి అందజేశారు. లేఖను స్వీకరించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. పళనిస్వామి, మంత్రులు భేటీ అనంతరం మీడియా ముందుకు సైతం రాకుండా నేరుగా కువత్తూరు క్యాంప్‌కు వెళ్లారు. పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించడాన్ని కూడా పరిగణించి, న్యాయనిపుణులతో చర్చించినానంతరం గవర్నర్ తన నిర్ణయాన్ని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.