సీపీఎం సారథి ఏ రాముడో!
- పోటీలో సీతారాం.. రామచంద్రన్
- ఆ ఇద్దరి చుట్టూ తిరుగుతున్న సభలు
- నాయకత్వ మార్పిడిపై తర్జన భర్జన
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సీపీఎంలో నాయకత్వ మార్పిడి అనుకున్నంత సునాయాసంగా కన్పించడం లేదు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్న దక్షిణాది నేతలిద్దరూ ఉద్దండులే కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వీరిద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలో తేల్చుకోలేక ప్రతినిధులు సతమతమవుతున్నారు. ‘మా పార్టీ నాయకత్వ ఎన్నిక మీరు(మీడియా) అనుకున్నంత క్లిష్టమైందో, బూర్జువా పార్టీల మాదిరి హోరాహోరీ జరిగేదో కాదు’ అని సీపీఎం నేతలు చెబుతున్నంత తేలి గ్గానైతే పరిస్థితి లేదు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పదవీకాలం ఈ నెల 19తో ముగియనుంది. విశాఖలో జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభ 19న కొత్త ప్రధాన కార్యదర్శిని, పొలిట్‌బ్యూరోను ఎన్నుకోవాల్సి ఉంది.
నూతన రాజకీయ, ఎత్తుగడల పంథా, సరికొత్త రాజకీయ విధానం, పార్టీ పునర్నిర్మా ణం, వచ్చేఏడాది జరుగనున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కొత్త రథసారథి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రధాన కార్యదర్శి పదవికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీతారాం ఏచూరి, కేరళకు చెందిన రామచంద్రన్ పిళ్లై పోటీపడుతున్నారు. ఇద్దరూ పొలిట్‌బ్యూరో సభ్యులే. సీనియర్లే. సీతారాం తెలుగువారే అయినా బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. కాగా ఈసారి మహిళకు అవకాశమిస్తే ఎలా ఉంటుందన్న భావనా వ్యక్తమైంది. కానీ ప్రస్తుతం ఆస్థాయి వ్యక్తి పార్టీలో ఎవరూలేరు. ఉన్న ఏకైక పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కారత్ భార్య. ఆయన తప్పుకోగానే ఆమెకు ఈ పదవిస్తే ప్రజల్లోకి తప్పు భావన వెళ్లే వీలున్నందున ప్రస్తుతానికీ అంశాన్ని పక్కనబెట్టారు. దీంతో ఏచూరి, పిళ్లై మధ్యనే పోటీ కేంద్రీకృతమైంది.
పార్టీ వ్యవహారాల్లో చేయితిరిగిన నేత ఏచూరి ...
అగ్రవర్ణానికి చెందిన సీతారాం ఏచూరి(63) అటు పార్లమెంటరీ ఇటు పార్టీ వ్యవహారాల్లోనూ చేయితిరిగిన నేత. పలు భాషల్లో మాట్లాడగల దిట్ట. వయసు రీత్యానూ ప్రస్తుత పొలిట్‌బ్యూరో సభ్యుల్లో చిన్నవారు. పార్టీ సైద్ధాంతిక, వ్యూహకర్తల్లో ఒకరు. ప్రస్తుతం పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నందున ఈయనకు అవకాశమిస్తే ఇప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీని నడిపిస్తారన్న అభిప్రాయం ఓ వర్గంలో ఉంది. బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు జరుగనున్నందున.. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల్ని, చిన్నచిన్న ఎంఎల్ గ్రూపులను ఏకతాటిపైకి తెచ్చి పార్టీకి పునరుజ్జీవం కల్పిస్తారన్న భావనా ఉంది. బెంగాల్‌తోపాటు త్రిపుర, తెలంగాణ, తమిళనాడు, కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు పూర్తిగా, ఆంధ్రా నుంచి పాక్షిక మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తోంది. చెప్పుకోదగిన ఉద్యమ చరిత్ర లేదని, మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించలేదని, తెరవెనుక వ్యవహారాలు నిర్వహిస్తుంటారన్న విమర్శలు ఆయనకున్న ప్రతికూలతలు.
సుదీర్ఘ అనుభవం రామచంద్రన్ సొంతం
కేరళలో బలమైన వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్రన్ పిళ్లై(77)కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఉద్యమ చరిత్ర ఉన్నవారు. వ్యవసాయరంగ సమస్యలపై మంచి పట్టుంది. సైద్ధాంతిక అవగాహనా అపారమే. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ వ్యతిరేకవర్గంతోపాటు బిహార్, తమిళనాడు, ఏపీలో కొంతమేరకు మద్దతుంది. ప్రకాశ్ కారత్ మద్దతూ ఆయనకే ఉన్నట్టు సమాచారం. హిందీ సరిగా మాట్లాడలేకపోవడం, వయస్సు ప్రతికూలతలు.
ఎన్నిక జరిగే విధానమిలా..
మహాసభకు హాజరైన ప్రతినిధులు కేంద్ర కమిటీని ఎన్నుకుంటారు. ఈ కమిటీ ప్రధానకార్యదర్శిని ఎన్నుకుంటుంది. ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో సభ్యులను ఎంపిక చేసి కేంద్ర కమిటీకి తెలియజేస్తారు. ఆ కమిటీ ఆమోదం తర్వాత పేర్లను మహాసభలో ప్రకటిస్తారు. మహా సభల్లో ఈ ప్రక్రియ అంతా ఆదివారం జరుగుతుంది.