
'ఇంత జరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నారు?'
న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీపై ఉమ్మడి దాడి మొదలుపెట్టాయి. గురువారం నాటి రాజ్యసభ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు దళితులపై జరుగుతున్న దాడులను, గోసంరక్షణ పేరిట ముస్లింలను కొట్టి చంపుతున్న సంఘటనలపై పలువురు నేతలు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకు మంచిని చేయండి. గోసంరక్షణ పేరిట చేస్తున్న నాటకాలన్నీ ఆపేయండి. ధనవంతులు మాత్రమే స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారు.
పేదలకు, ఆదివాసీలకు అది అందడం లేదు. ఈ దేశంలో ఇక ఏ మాత్రం రైతుల ఆత్మహత్యలు జరగనివ్వకూడదు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయ రంగంపై బాగా పడింది. చేతుల్లో డబ్బు లేక అప్పులు చేయలేక రైతన్న ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దళితులపై దాడులు (ఈసమయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ విషయం గుర్తుచేశారు) జరుగుతుంటే ఏం చేస్తున్నారు. ఓ వ్యక్తిపై మూకపడి కొట్టి చంపడానికి తాలిబన్‌కు పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ గోసంరక్షణ పేరిట దాడులు జరుగుతుంటే తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు అంటున్నారని, అయితే, గో సంరక్షక దళాన్ని విశ్వహిందూపరిషత్ నియమిస్తోందని, వారికి భజరంగ్‌దల్‌వాళ్లు శిక్షణ ఇస్తున్నారని దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఇంత జరుగుతున్న ప్రధాని ఏం చేస్తున్నారని, ఎందుకు బీజేపీ నేతలు సీరియస్‌గా స్పందిండచం లేదని మండిపడ్డారు. ఇక సీపీఐ నేత డీ రాజా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులకు రక్షణ ఇవ్వడంలో ఉమ్మడిగా విఫలమయ్యామని అన్నారు. 70ఏళ్ల తర్వాత వ్యక్తులపై దాడి చేసి కొట్టడం అనే అంశాన్ని సభలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, దీనిని చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు, మహిళలకు ఇక మనపై ఎలాంటి సానుభూతి చూపించే ఉద్దేశం లేకుండా పోయిందని, ప్రతినిధులుగా వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.