ముగ్గురిని బలి తీసుకున్న ఎలుగుబంటి
ఛత్తీస్‌ఘడ్: ఎలుగుబంటి దాడిలో అటవీశాఖ అధికారి సహా ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని మహసాముంద్ జిల్లాలో నవగాన్ అటవీప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. మృతులు.. డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ అధికారి శాహిల్ ఖాన్, దన్‌సిన్హ్ కన్వర్(65), షత్రూన్ శిదార్ (35) గా జిల్లా పోలీసు అధికారి ఆదివారం పిటిఐకి వెల్లడించారు. శనివారం ఉదయం కన్వర్, శిదార్ ఇద్దరు ఆవాల పూలను సేకరించేందుకు నవగాన్ అడవికి వెళ్లారు.
అయితే అడవికి వెళ్లిన ఇద్దరూ ఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో కంగారుపడిన బంధువులు వారిని వెతికేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి సహాయంతో అడవిలోకి వెళ్లగా.. ఎలుగుబంటికి చేరువలో కన్వర్, శిదార్ మృతదేహాలు తారసపడ్డాయి. అది గమనించిన ఎలుగుబంటి వారిపై కూడా దాడికి పాల్పడింది. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన అటవీశాఖ అధికారి శాహిల్ ఖాన్ అక్కడిక్కడే మృతిచెందాడు.