కనుమరుగు కానున్న ‘ఐఎన్‌ఎస్-విక్రాంత్’
సాక్షి, ముంబై: రెండో ప్రపంచ యుద్ధంలో విశేష సేవలందించిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్-విక్రాంత్ ఇక కనుమరుగు కానుంది. దీని గురించి పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప చూసే భాగ్యం లేకుండా పోనుంది. జూలైలో అత్యున్నత న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చే సూచనలు ఉన్నాయి. కాలం చెల్లిపోవడంతో తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మ్యూజియంగా మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో విశేష సేవలు అందించిన ‘ఐఎన్‌ఎస్-విక్రాంత్’ 15,500 టన్నులుంది.
ప్రస్తుతం ఈ యుద్ధనౌక దారుఖాన బందరు సమీపంలో లంగరు వేసి ఉంది. 70 ఏళ్లకుపైగా సేవలు అందించిన నౌక ప్రస్తుతం కాలం తీరిపోయింది. దీంతో సేవల నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు టెండర్లను కూడా ఆహ్వానించింది. కానీ అనేక సామాజిక సేవా సంస్థలు, విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యూక్లియర్ విభాగంలో పనిచేసే రెండు వేల మంది ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీన్ని విక్రయించవద్దని మ్యూజియంగా మార్చాలని పట్టుబట్టారు. కానీ ఈ నౌక నిర్వహణ భారం భరించడం తమవల్ల కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఆహ్వానించిన టెండర్లలో రూ.60 కోట్లకు విక్రాంత్ నౌకను ఐ అండ్ బి కమర్షియల్ అనే సంస్థ కొనుగోలు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని సేవా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. అక్కడ కూడా చక్కెదురు కావడంతో అత్యున్నత న్యాయంస్థానాన్ని ఆశ్రయించారు. వచ్చే నెలలో దీనిపై తీర్పు రానుంది. కానీ టెండర్లలో ఐ అండ్ బి కమర్షియల్ సంస్థ కొనుగోలు చేయడంతో తీర్పు కూడా ఈ సంస్థకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే దీన్ని ముక్కలు చేయడం ఖాయం. పూర్తిగా ముక్కలు చేయాలంటే అందుకు సంవత్సరంన్నర సమయం పడుతుంది.
అందుకు 200పైగా కార్మికులు పనిచేస్తారు. దీని ద్వారా లభించిన ఉక్కు ముక్కలను స్టీల్ ప్లాంట్ రోలింగ్ కంపెనీకి పంపిస్తారు. అక్కడ భవన నిర్మాణానికి వినియోగించే ఇనుప చువ్వలు తయారు చేస్తారని ఐ అండ్ బి కమర్షియల్ డెరైక్టర్ అబ్దుల్ కరీం చెప్పారు. ప్రస్తుతం దీని నిర్వహణ బాధ్యతలు ఈ సంస్ధపైనే ఉన్నాయి. విక్రాంత్ యుద్ధనౌక సేవలందించిన సమయంలో దాదాపు 12 వేల మంది నేవి కమాండర్లు, అధికారులు, ఉద్యోగులు దీనిపై పనిచేసేవారు. అయితే టెండర్‌లో ఇది అమ్ముడు పోయిందని తెలియగానే అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చివరకు చేసేదిలేక తుది వీడ్కోలు పలికేందుకు భారీగా ఏర్పాట్లుచేసి బందరు నుంచి సాగనంపారు. ప్రస్తుతం అది దారుఖాన బందరులో ఆగింది.