The Second World War
-
వాళ్లు వాడేశారు... వీళ్లు పాడేశారు!
కాలంపాట వాడి పడేసిన వస్తువులకు ఏ విలువా ఉండదు. ఒకవేళ విలువ ఉందీ అంటే ఆ వస్తువును వాడి పడేసింది ఎవరో ప్రముఖులై ఉండాలి. ఈ ఫోన్‌ను చూడండి. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది! దీన్ని వాడిందెవరో తెలుసా? జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్. గిర్రున డయల్ తిప్పి కాల్ చేసి, ‘చంపేయండి’ అని అదేశాలు జారీచేసి లక్షల మంది యూదు జాతీయుల్ని ఈ ఫోన్ ద్వారానే హిట్లర్ హతమార్చాడు. అందుకే దీనికి ‘డెత్ ఫోన్’ అనే పేరొచ్చింది. హిట్లర్ చనిపోయాక ఇది బ్రిటిష్ వాళ్ల చేతికొచ్చింది. ఇప్పుడు దీన్ని యు.ఎస్.లోని ‘అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్’లో ఈ నెల 19న వేలం వేస్తున్నారు. 5 లక్షల డాలర్లకు అమ్ముడుపోవచ్చని అంచనా. సుమారు 3 కోట్ల 35 లక్షల రూపాయలు. ఈ సందర్భంగా.. ప్రసిద్ధ వ్యక్తులు వాడిన ఇలాంటి కొన్ని వస్తువులను, వేలంలో వాటికి వచ్చిన ధరను ఒకసారి చూద్దాం. జె.కె.రోలింగ్ ఛెయిర్ హ్యారీ పోటర్ రచయిత్రి జె.కె.రోలింగ్ తొలినాళ్లలో ఈ కుర్చీమీద కూర్చొనే తన నవలల్ని రాశారు. గత ఏడాది న్యూయార్క్‌లోని హెరిటేజ్ ఆక్షన్‌లో ఇది 3,94,000 డాలర్లకు అమ్ముడుపోయింది! సుమారు 2 కోట్ల 64 లక్షల రూపాయలు. క్వీన్ ఎలిజబెత్ 2 ప్యాంటీలు రాజ కుటుంబాల వస్తువులు అరుదుగా వేలం పాటలో దర్శనం ఇస్తాయి. అందుకే ఎక్కువ ధరకు అమ్ముడుపోతాయి. 1968లో రాణిగారి ప్యాంటీల జత ఉన్న లగేజీ పొరపాటున విమానంలో ఉండిపోయింది. ఆ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి ఆ ప్యాంటీలు 2012లో ఈబే అక్షన్స్కు వచ్చాయి. 18,000 డాలర్లకు ఎగిరిపోయాయి! సుమారు 12 లక్షల రూపాయలు. అబ్రహాం లింకన్ కళ్లజోడు 2008 హెరిటేజ్ ఆక్షన్‌లో జరిగిన వేలంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కళ్లజోడు 1,79,250 డాలర్లు çపలికింది! సుమారు కోటీ 20 లక్షల రూపాయలు. మహాత్మాగాంధీ బౌల్, ఫోర్క్, స్పూన్లు పుణెలోని ఆగా ఖాన్ ప్యాలెస్‌లో, ముంబైలోని పామ్ బన్ మౌస్‌లో ఖైదీగా ఉన్నప్పుడు జాతిపిత మహాత్మాగాంధీ వాడిన ఈ పాత్రలు, స్పూన్లు ‘ఫాల్ ఫ్రేజర్ కలెక్టిబుల్స్’ (ఇంగ్లండ్) లో ఇప్పుడు వేలానికి రాబోతున్నాయి. ఇవి మొత్తం కలిపి 94,000 డాలర్లు పలకవచ్చని అంచనా. సుమారు. 62 లక్షల 83 వేల రూపాయలు. మైఖేల్ జాక్సన్ ఫెడోరాi ఫెడోరా అంటే మగాళ్ల టోపి. 1984 అక్టోబర్‌లో చికాగోలో జరిగిన స్టేజ్ షోలో పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ఈ ఫెడోరాను ధరించాడు. గత ఏడాది జూలియన్స్ ఆక్షన్‌లో ఇది 10,240 డాలర్లకు పోయింది. సుమారు 6 లక్షల 84 వేల రూపాయలు. -
మేం పుతిన్‌ను పిలుస్తాం
మిలటరీ పరేడ్‌కు చైనా సన్నద్ధం భారత్‌లో ఒబామా పర్యటనకు పోటీగా పుతిన్‌ను పిలిచేందుకు నిర్ణయం బీజింగ్: భారత రిపబ్లిక్ డే పరేడ్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆహ్వానించటాన్ని చైనాకు ఇబ్బందిగా మారింది. గత మూడు రోజులుగా భారత్‌ను హెచ్చరిస్తూ చైనా మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా తానూ ఓ సైనిక కవాతును నిర్వహించేందుకు చైనా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ విజయాలకు 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అతి పెద్ద సైనిక కవాతు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరేడ్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. వాస్తవానికి ఇలాంటి పరేడ్లు దశాబ్దానికి ఒకసారి నిర్వహించటం చైనా ఆనవాయితీ.. కానీ.. ఒబామా ముందు భారత సైనిక సత్తా చాటడంతో చైనా ప్రపంచ యుద్ధ విజయాల కారణంతో తానూ సైనిక బల ప్రదర్శన చేయాలని భావిస్తోంది. కాగా చైనా మీడియా అదే పనిగా భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఒబామా న్యూఢిలీల పర్యటన వెనుక, చైనా భారత్‌ల సంబంధాలను దెబ్బతీయటమే ప్రధాన లక్ష్యమని పేర్కొంది. భారత్, అమెరికాల మధ్య పెరుగుతున్న స్నేహం చైనాతో పాటు రష్యాతో కూడా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనా ప్రభుత్వ నేతృత్వంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. భారత గణతంత్ర వేడుకల్లో మోదీ, ఒబామాలు కలసి ఉన్న ఫొటోను ఈ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. చైనాను ఇరుకున పెట్టేందుకు అమెరికా భారత్‌ను వినియోగించుకుంటోందని చైనా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఝు ఫాన్‌యిన్ వ్యాఖ్యానించారు. కొత్త ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేయటం ద్వారా ఆసియా ప్రాంతంలో ఒక కొత్త శకానికి నాంది పలికినట్లయిందని కూడా పేర్కొన్నారు. దక్షిణాసియాలో అమెరికాకు భారత్ మిత్రపక్షంగా మారిందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాలని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్ లక్ష్యమని, ఈ రెండింటికి కూడా భారత్‌కు అమెరికా సహాయం చాలా అవసరమని అన్నారు. భద్రతామండలి సభ్యత్వం కంటే కూడా భారత్ చైనాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం కావటం, ఆసియాలో సుస్థిరత సాధించటం ముఖ్యమన్నారు. నిరుడు సెప్టెం బర్లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించినప్పుడు ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అమ లు.. అమెరికాతో భారత్ స్నేహం వల్ల కష్టసాధ్యమవుతుందన్నారు. -
కనుమరుగు కానున్న ‘ఐఎన్ఎస్-విక్రాంత్’
సాక్షి, ముంబై: రెండో ప్రపంచ యుద్ధంలో విశేష సేవలందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్-విక్రాంత్ ఇక కనుమరుగు కానుంది. దీని గురించి పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప చూసే భాగ్యం లేకుండా పోనుంది. జూలైలో అత్యున్నత న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చే సూచనలు ఉన్నాయి. కాలం చెల్లిపోవడంతో తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మ్యూజియంగా మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో విశేష సేవలు అందించిన ‘ఐఎన్ఎస్-విక్రాంత్’ 15,500 టన్నులుంది. ప్రస్తుతం ఈ యుద్ధనౌక దారుఖాన బందరు సమీపంలో లంగరు వేసి ఉంది. 70 ఏళ్లకుపైగా సేవలు అందించిన నౌక ప్రస్తుతం కాలం తీరిపోయింది. దీంతో సేవల నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు టెండర్లను కూడా ఆహ్వానించింది. కానీ అనేక సామాజిక సేవా సంస్థలు, విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యూక్లియర్ విభాగంలో పనిచేసే రెండు వేల మంది ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీన్ని విక్రయించవద్దని మ్యూజియంగా మార్చాలని పట్టుబట్టారు. కానీ ఈ నౌక నిర్వహణ భారం భరించడం తమవల్ల కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆహ్వానించిన టెండర్లలో రూ.60 కోట్లకు విక్రాంత్ నౌకను ఐ అండ్ బి కమర్షియల్ అనే సంస్థ కొనుగోలు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని సేవా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. అక్కడ కూడా చక్కెదురు కావడంతో అత్యున్నత న్యాయంస్థానాన్ని ఆశ్రయించారు. వచ్చే నెలలో దీనిపై తీర్పు రానుంది. కానీ టెండర్లలో ఐ అండ్ బి కమర్షియల్ సంస్థ కొనుగోలు చేయడంతో తీర్పు కూడా ఈ సంస్థకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే దీన్ని ముక్కలు చేయడం ఖాయం. పూర్తిగా ముక్కలు చేయాలంటే అందుకు సంవత్సరంన్నర సమయం పడుతుంది. అందుకు 200పైగా కార్మికులు పనిచేస్తారు. దీని ద్వారా లభించిన ఉక్కు ముక్కలను స్టీల్ ప్లాంట్ రోలింగ్ కంపెనీకి పంపిస్తారు. అక్కడ భవన నిర్మాణానికి వినియోగించే ఇనుప చువ్వలు తయారు చేస్తారని ఐ అండ్ బి కమర్షియల్ డెరైక్టర్ అబ్దుల్ కరీం చెప్పారు. ప్రస్తుతం దీని నిర్వహణ బాధ్యతలు ఈ సంస్ధపైనే ఉన్నాయి. విక్రాంత్ యుద్ధనౌక సేవలందించిన సమయంలో దాదాపు 12 వేల మంది నేవి కమాండర్లు, అధికారులు, ఉద్యోగులు దీనిపై పనిచేసేవారు. అయితే టెండర్లో ఇది అమ్ముడు పోయిందని తెలియగానే అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చివరకు చేసేదిలేక తుది వీడ్కోలు పలికేందుకు భారీగా ఏర్పాట్లుచేసి బందరు నుంచి సాగనంపారు. ప్రస్తుతం అది దారుఖాన బందరులో ఆగింది. -
కథ ముగిసిన చిత్రం..
రెండో ప్రపంచయుద్ధం ముగిసిన ఆనందంలో ముద్దుపెట్టుకుంటున్న అమెరికా సైనికుడు, నర్సు చిత్రమిది. ఆ యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం చాలా ప్రాచుర్యం పొందింది. ఇందులోని నర్సు ఎడిత్ షేన్.. దాదాపు నాలుగేళ్ల కింద తన 91వ ఏట మరణించింది. ఆ సైనికుడు గ్లెన్ ఎడ్వర్డ్ మెక్‌డఫీ ఈ నెల 9న తన 86వ ఏట గుండెపోటుతో మరణించారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ ఆల్ఫ్రెడ్ ఐసెన్స్టాడిట్ తీసిన ఈ చిత్రం.. చాలా ఏళ్ల పాటు ఒక మిస్టరీగా నిలిచింది. అందులోని వ్యక్తులెవరనేదానిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది కూడా. 1970వ దశకంలో అందులోని నర్సు తానేనంటూ ఎడిత్ షేన్ బయటపెట్టగా.. తర్వాత చాలా కాలానికి మెక్‌డఫీ పేరు వెల్లడైంది. అసలు ఈ ఫొటో తీసిన నేపథ్యమూ విచిత్రమే. 1945 ఆగస్టు 14న అమెరికా, బ్రిటన్ తదితర మిత్రరాజ్యాల సేనలకు జపాన్ లొంగిపోవడంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. ‘వీ-జే డే (విక్టరీ ఆన్ జపాన్ డే)’గా పేర్కొనే ఆ రోజున అమెరికా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రజలంతా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆ ఆనందంలో మెక్‌డఫీ అక్కడ కనిపించిన చాలా మంది మహిళలను వరుసగా ముద్దుపెట్టుకున్నాడు. అలా ఎడిత్‌ను ముద్దుపెట్టుకుంటుండగా ఐసెన్స్టాడిట్ తన కెమెరాతో క్లిక్ మనిపించాడు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ముద్దుకు ముందు ఎడిత్, మెక్డఫీలకు ఒకరికొకరికి అసలు పరిచయమే లేదు.. ఆ తర్వాతా కలవలేదు.. ఇక ఇప్పుడు వారిద్దరూ లేరు!