కథ ముగిసిన చిత్రం.. | The end of the film is the story .. | Sakshi
Sakshi News home page

కథ ముగిసిన చిత్రం..

Published Tue, Mar 18 2014 3:20 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

కథ ముగిసిన చిత్రం.. - Sakshi

కథ ముగిసిన చిత్రం..

 రెండో ప్రపంచయుద్ధం ముగిసిన ఆనందంలో ముద్దుపెట్టుకుంటున్న అమెరికా సైనికుడు, నర్సు చిత్రమిది. ఆ యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం చాలా ప్రాచుర్యం పొందింది. ఇందులోని నర్సు ఎడిత్ షేన్.. దాదాపు నాలుగేళ్ల కింద తన 91వ ఏట మరణించింది. ఆ సైనికుడు గ్లెన్ ఎడ్వర్డ్ మెక్‌డఫీ ఈ నెల 9న తన 86వ ఏట గుండెపోటుతో మరణించారు.


అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ ఆల్‌ఫ్రెడ్ ఐసెన్‌స్టాడిట్ తీసిన ఈ చిత్రం.. చాలా ఏళ్ల పాటు ఒక మిస్టరీగా నిలిచింది. అందులోని వ్యక్తులెవరనేదానిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది కూడా. 1970వ దశకంలో అందులోని నర్సు తానేనంటూ ఎడిత్ షేన్ బయటపెట్టగా.. తర్వాత చాలా కాలానికి మెక్‌డఫీ పేరు వెల్లడైంది. అసలు ఈ ఫొటో తీసిన నేపథ్యమూ విచిత్రమే. 1945 ఆగస్టు 14న అమెరికా, బ్రిటన్ తదితర మిత్రరాజ్యాల సేనలకు జపాన్ లొంగిపోవడంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది.


‘వీ-జే డే (విక్టరీ ఆన్ జపాన్ డే)’గా పేర్కొనే ఆ రోజున అమెరికా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రజలంతా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆ ఆనందంలో మెక్‌డఫీ అక్కడ కనిపించిన చాలా మంది మహిళలను వరుసగా ముద్దుపెట్టుకున్నాడు. అలా ఎడిత్‌ను ముద్దుపెట్టుకుంటుండగా ఐసెన్‌స్టాడిట్ తన కెమెరాతో క్లిక్ మనిపించాడు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ముద్దుకు ముందు ఎడిత్, మెక్‌డఫీలకు ఒకరికొకరికి అసలు పరిచయమే లేదు.. ఆ తర్వాతా కలవలేదు.. ఇక ఇప్పుడు వారిద్దరూ లేరు!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement