
'ఆ సీన్ రిపీటవనివ్వను'
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి రాష్ట్రపతి పాలనకు అవకాశం ఇవ్వబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అరుణా చల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ప్రస్తుతం ఈ పరిస్ధితి తలెత్తిన నేపథ్యంలో అలాంటిది ఢిల్లీలో పునావృతం కానివ్వబోనని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న చట్టప్రతినిధులు ఏం చెప్తున్నారో అనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పనిసరిగా వినాలని, ప్రజల అవసరాల మేరకే ప్రతిపక్షాల డిమాండ్లు ఉండాలని హితవు పలికారు.
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై స్పందన కోరగా 'ఢిల్లీలో మేం ఎప్పటికీ అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వబోం. వచ్చే రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో ఒక్క సీటుకూడా గెలుచుకోలేదని బీజేపీకి తెలుసు. అందుకే గుంఢాగిరి మార్గాన్ని ఎంచుకుంది. దానిని హిమాచల్ ప్రదేశ్లో తర్వాత ఢిల్లీలో ప్రయోగించాలనుకుంటున్నారు. ఢిల్లీలో తొలుత 21మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి.. మరో 23మంది ఎమ్మెల్యేలను కొనేయాలని అనుకుంటున్నారు' అని కేజ్రీవాల్ ఆరోపించారు.