రాష్ట్రపతి పాలన వివాదం‘ఆప్’ వాదనపై ఏమంటారు?
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాలుచేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆప్ లేవనెత్తిన అంశాలపై పది రోజులలో జవాబు ఇవ్వాలని న్యాయమూర్తులు ఆర్.ఎం. లోధా, దీపక్‌మిశ్రాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను న్యాయస్థానం మార్చి ఏడో తేదీకి వాయిదా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పిటిషన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నప్పటికీ న్యాయస్థానం ఈ రెండు పార్టీలకు నోటీసు జారీ చేయలేదు. తాను రాజ్యాంగపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తానని, రాజకీయ పార్టీల జోలికి పోనని పేర్కొంటూ న్యాయస్థానం ఈ రెండు పార్టీలకు నోటీసు జారీ చేయడానికి నిరాకరించింది. పిటిషనర్ ఈ రెండు రాజకీయపార్టీలపై కూడా ఆరోపణలు చేసినట్లు కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు, కేసు విచారణకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని పరిశీలిస్తామని బెంచ్ స్పష్టం చేసింది.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు కేజ్రీవాల్ సర్కారులో రవాణామంత్రిగా పనిచేసిన సౌరభ్ భరద్వాజ్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆప్ న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిపాలన బీజేపీకి సౌలభ్యంగా ఉన్నందు వల్లే ఆ పార్టీ రాష్ట్రపతి పాలనను వ్యతిరేకించడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను కోరుతున్నాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడానికి దారితీసిన పరిస్థితులను ఈ సందర్భంగా న్యాయస్థానానికి వివరించారు. ‘ఢిల్లీలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదు కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలి.
అవినీతి ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ నాయకులు, మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను కాపాడుకునేందుకే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్రపతి విధించింది. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఫిర్యాదుతో నమోదైన అవినీతి కేసులపై విచారణ జరగడంతో కాంగ్రెస్ నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లోనూ ఆ పార్టీ భారీ పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సహా చాలా మంది మంత్రులు ఓడిపోయారు. కేంద్రంలో తామే అధికారంలో ఉన్నాం కాబట్టి ఢిల్లీ రాష్ట్రాన్నికూడా పరోక్షంగా పాలించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఫలితంగా కేసుల విచారణను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోంది. కాబట్టి రాష్ట్రపతి పాలన విధింపు ఏకపక్షమేగాక చట్టవిరుద్ధం. రాజ్యాంగంలోని 14 అధికరణానికి పూర్తి విరుద్ధం. ఇది ఢిల్లీవాసుల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోంది. ఏ ఒక్క పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు తాజాగా ఎన్నికలు నిర్వహించాలని చట్టాలు చెబుతున్నాయి.
అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది’ అని ఆప్ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, నారిమన్ బెంచ్‌కు వివరించారు. రాష్ట్రంలోని అతిపెద్ద పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేదని చెప్పినందున, ఎల్జీ అసెంబ్లీని రద్దు చేసి ఉండాల్సిందని ఆప్ అభిప్రాయపడింది. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడంపై ఆగ్రహించిన ఆప్.. ప్రభుత్వం నుంచి వైదొలగడం తెలిసిందే. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే చాలా మంది కాంగ్రెస్ నాయకులు జైలు పాలు అవుతారు కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ కమ్మక్కై అడ్డుకున్నారని ఆప్ ఆరోపించింది. జన్‌లోక్‌పాల్ బిల్లు రాజ్యాంగవిరుద్ధం కాబట్టే దానిని వ్యతిరేకించామని ఈ రెండు పార్టీలు వాదించాయి. అవినీతి నిరోధంపై అరవింద్ కేజ్రీవాల్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించాయి.