
నా కుక్కలను వదిలి ఎక్కడికీ వెళ్లను: రమ్య
పాకిస్థాన్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య సమర్థించుకున్నారు. అదే సమయంలో తాను భారతదేశాన్ని మాత్రం విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లబోనని స్పష్టం చేశారు. తాను తన ఇంటిని.. తాను పెంచుకునే కుక్కలను కూడా వదిలి ఎటూ వెళ్లనని తెలిపారు. పాక్ విషయంలో తాను చెప్పిన అంశాలపై కేసు దాఖలు కావడం నిజంగా బాధాకరమని.. అయితే దేశంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంటుందని, బలవంతంగా మీ సిద్ధాంతాలను ఒకరిమీద రుద్దాలనుకోవడం సరికాదని తెలిపారు.
పాకిస్థాన్ అంటే నరకం కాదని.. అక్కడి ప్రజలు కూడా మనలాంటి వాళ్లేనని రమ్య పునరుద్ఘాటించారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం విద్వేషాలను రెచ్చగొడుతుంటారని.. కేవలం సరిహద్దులు మనల్ని విడగొడుతున్నాయి కాబట్టి ఇతరులను ద్వేషించడం సరికాదని ఆమె చెప్పారు. వాక్ స్వాతంత్ర్యంలో భాగంగా మనం శాంతి, సమైక్యతలను గురించి కూడా మాట్లాడాలని.. స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యంలో తప్పని రమ్య తెలిపారు.