పాక్ ఖైదీలను వదిలేది లేదు: భారత్
భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించడంతో.. భారత్ దీటుగా స్పందించింది. బుధవారం నాడు విడుదల చేయాల్సిన దాదాపు 12 మంది పాకిస్తానీ ఖైదీలను ఇక విడుదల చేసేది లేదని స్పష్టం చేసింది. పాకిస్తానీ ఖైదీలను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. శిక్షా కాలాన్ని పూర్తిచేసుకున్న ఖైదీలను విడుదల చేసి, వారి స్వదేశాలకు పంపడాన్ని భారత్, పాక్ దేశాలు చాలాకాలంగా అమలుచేస్తున్నాయి.
కులభూషణ్ జాదవ్ (46) గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించి.. ఆయనకు మరణశిక్ష విధిస్తున్నట్లు పాకిస్తాన ప్రకటించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా కూడా ధ్రువీకరించారు. కనీసం న్యాయం, చట్టాలకు సంబంధించిన ప్రాథమిక నియమాలను కూడా పాటించకుండా పాకిస్తాన్ ఇలా చేసిందంటూ భారత్ తీవ్రంగా మండిపడింది. భారతదేశంలో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్‌ను విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్ పిలిపించి, తీవ్రమైన పదజాలంతో ఒక ఖండన లేఖ ఇచ్చారు.