సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకోవడంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ప్రత్యర్ధులపై నిప్పులు చెరుగుతున్నారు. ఉగ్రవాదులపై కాల్పులు జరిపే ముందు మన సైనికులు ఈసీ అనుమతి తీసుకోవాలా అని జమ్ము కశ్మీర్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. దేశంలో ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరుపుతున్నారని విపక్షాలు చెబుతుండటం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
యూపీలోని ఖుషీనగర్‌లో ఆదివారం జరిగిన ప్రచార ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ ప్రజలు సమర్ధ ప్రభుత్వానికే పట్టం కడతారని విపక్షాలకు ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ-బీఎస్పీ కూటమిపై విమర్శలు గుప్పిస్తూ అఖిలేష్, మాయావతిలు ఇద్దరూ కలిసి యూపీ సీఎంగా పనిచేసిన సమయం కంటే ఎక్కువగా తాను గుజరాత్ సీఎంగా వ్యవహరించానని గుర్తుచేశారు.
తనపై ఎలాంటి అవినీతి మరకా లేదని ఆయన చెప్పుకున్నారు. అల్వార్ సామూహిక లైంగిక దాడి కేసులో బీఎస్పీ చీఫ్ మాయవతి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ బాధితురాలి తరపున మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో మీకు చిత్తశుద్ధి ఉంటే రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఉపసంహరించుకోలేదని ఆమెను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment