రుణమాఫీ చేయకుంటే.. ప్రభుత్వం నుంచి తప్పుకొంటాం
రైతులకు రుణమాఫీ ప్రకటించడంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విఫలం అయితే తాము ప్రభుత్వం నుంచి తప్పుకొంటామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మరోసారి హెచ్చరించారు. నాసిక్‌లో జరిగిన రైతుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, అందుకే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఠాక్రే అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి భాష మారిపోయిందని, తమకు మాత్రం రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో.. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని గుర్తుచేశారు.
రైతుల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుఉడ రావుసాహెబ్ దన్వే చేసిన వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నారని, ఆ తర్వాత ఎన్నికలొస్తే వాళ్లు మిమ్మల్ని ఏడ్చేలా చేస్తారని హెచ్చరించారు. దాంతో ఒక్కసారిగా అక్కడున్న రైతులంతా చప్పట్లతో సమావేశ ప్రాంగణాన్ని మార్మోగించారు. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేందుకు తాము ఒక్క నిమిషం కూడా ఆలోచించబోమని, అయితే రుణమాఫీ ప్యాకేజి ప్రకటిస్తే మాత్రం బయటి నుంచి మద్దతిస్తామని అన్నారు. రైతుల రుణాలు వీలైనంత త్వరలో మాఫీ చేయకపోతే తాము అధికారపక్షంలో ఉన్నా కూడా అసెంబ్లీ వరకు పాదయాత్ర చేస్తామని ప్రకటించారు.