సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో శరద్ పవార్(ఫైల్ ఫొటో)
ముంబై: ఎన్సీపీ అధినేత శరాద్ పవార్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ఆదివారం భేటీ అయ్యారు. సుమారు 40ల నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. కాగా శివసేన ముఖ్యనేత, ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో రహస్యంగా సమావేశమైన మరుసటి రోజే వీరిరువురు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే కోవిడ్-19 పరిస్థితులు, అన్‌లాక్ ప్రక్రియ, దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల గురించి చర్చించేందుకే వీరు సమావేశమయ్యారని సంకీర్ణ ప్రభుత్వ మద్దతుదారులు అంటున్నారు.
ఫడ్నవిస్ మా శత్రువేమీ కాదు
కాగా శివసేన అధికార పత్రిక సామ్నా పత్రిక కథనం కోసం సంజయ్ రౌత్, ఫడ్నవిస్‌ను ఇంటర్వ్యూ చేయాలని భావించారని, అందుకే ఆయనను కలిశారని బీజేపీ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. సంజయ్ రౌత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్ మా శత్రువేమీ కాదు. గతంలో ఆయనతో కలిసి పనిచేశాం. సామ్నా ఇంటర్వ్యూ కోసమే ఆయనను కలిశాను. ముందుగా అనుకున్న ప్రకారమే ఈ భేటీ జరిగింది. ఉద్ధవ్ ఠాక్రేకు కూడా ఈ విషయం గురించి తెలుసు. అయినా ఫడ్నవిస్‌ను కలవడం నేరమా ఏంటి? ఆయన మాజీ సీఎం. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.(చదవండి: దేవేంద్ర ఫడ్నవిస్‌తో సంజయ్ రౌత్ భేటీ)
మా మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయే గానీ మేమేమీ శత్రువులం కాదు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఫడ్నవిస్‌నే గాకుండా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, హోం మంత్రి అమిత్ షాను కూడా తాను ఇంటర్వ్యూ చేస్తానని వెల్లడించారు. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీతో పొత్తుకు గుడ్‌బై చెప్పిన శివసేన, ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న మరాఠా పార్టీ, వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై విరుచుకుపడుతోంది.
ఇక ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి, హీరోయిన్ కంగనా రనౌత్ పీఓకే వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు వర్గాలు పరస్పరం తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికి దిగాయి. ఇలాంటి తరుణంలో శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్, ఫడ్నవిస్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే ఇందులో రాజకీయ కారణాలేవీ లేవని చెప్పినప్పటికీ ఒకప్పుడు మిత్రపక్షాలైన శివసేన- బీజేపీ కీలక నేతలు ఇలా సమావేశమవడం హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment