ఢిల్లీ: రచయితలకు, భావప్రకటన స్వేచ్ఛకు అండగా నిలబడటంలో కేంద్ర ప్రభుత్వ ధోరణి మారకపోతే తాను కూడా అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్టు ప్రముఖ కవి, నవలా రచయిత విక్రమ్ సేథ్ వెల్లడించారు. 'వర్స్- ద గోల్డెన్ గేట్' నవలకు గానూ 1988లో విక్రమ్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఒక ప్రముఖ టీవీ చానల్ ఏర్పాటు చేసిన చర్చాగోష్టి లో ఆయన శనివారం మాట్లాడారు.'అవార్డులను వెనక్కి ఇచ్చినవారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. అవార్డులను వెనక్కి ఇవ్వాలంటే దైర్యం ఉండాలి' అని ఈ సందర్భంగా విక్రమ్ సేథ్ అన్నారు. మీరు కూడా అవార్డు వెనక్కి ఇస్తారా అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు.. కవులు, రచయితల భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభుత్వ తీరు మారకపోతే తన అవార్డును తప్పకుండా తిరిగి ఇచ్చేస్తానని సేథ్ స్పష్టం చేశారు.